- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయలసీమపై కేసీఆర్ ఫోకస్.. BRSలోకి ఆ కీలక నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఇప్పుడు రాయలసీమపై దృష్టి పెట్టింది. కోస్తా ప్రాంతానికి చెందిన నేతను ఆ రాష్ట్ర బీఆర్ఎస్ చీఫ్‌గా ఇప్పటికే ప్రకటించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన రాయలసీమకు సైతం పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నది. ఆ ప్రాంతానికి పార్టీని విస్తరింపజేయడంపై ఏపీ స్టేట్ చీఫ్ తోట చంద్రశేఖర్‌తో అధినేత కేసీఆర్ ఇటీవల చర్చించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక నేతతో ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు పూర్తయ్యాయి. త్వరలో ప్రగతి భవన్‌కు ఆహ్వానించి ఆ తదుపరి ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆయనతో పాటు మరో పది మంది జిల్లాస్థాయి నేతలు కూడా చేరే అవకాశమున్నది. ఆ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలోనూ రాయలసీమ పట్ల అప్పటి టీఆర్ఎస్ నేతలు నెగెటివ్ కామెంట్లు చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు రాయలసీమలో పర్యటించారు. రాయలసీమను రతణాల సీమగా మారుస్తానని కూడా గతంలో ఆ ప్రాంతం నుంచే ప్రకటన చేశారు. రాయలసీమ హక్కుల కోసం కొట్లాడుతున్న సంఘాల ప్రతినిధులను సైతం ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో మంతనాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా రాయలసీమ అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే తరహాలో ఉన్నదనే అసంతృప్తి ఆ ప్రాంత నేతల్లో వ్యక్తమవుతున్నది.
ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్‌తో పాటు అభివృద్ధి కోసం వివిధ సంఘాలకు చెందిన నేతలు వేర్వేరుగా గొంతెత్తుతున్నారు. మూడు రాజధానుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా కర్నూలు జిల్లాకు, రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే స్వరం వినిపిస్తున్నది. ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్‌గా ఉన్న విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ఇటీవల ఖమ్మం సభలోనూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మళ్ళీ జాతికి అంకితం చేసి ప్రభుత్వరంగ సంస్థగా మారుస్తామన్నారు. ఇప్పుడు రాయలసీమ హక్కుల విషయంలోనూ ఇలాంటి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాయలసీమలో బీఆర్ఎస్ అడుగు పెట్టడానికి కృష్ణా జలాల వివాదం సంకటంగా మారింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మధ్య దీర్ఘకాలంగా కృష్ణా జలాల విషయంలో ఘర్షణలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం తదితర పలు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ ఘర్షణలను ప్రస్తావించకుండా, వాటికి పరిష్కారాన్ని సూచించకుండా రాయలసీమలో బీఆర్ఎస్‌ను నిలదొక్కుకునేలా చేయడం కేసీఆర్‌కు సవాలుగా మారింది. రాయలసీమకు న్యాయం చేసే పేరుతో తెలంగాణకు అన్యాయం జరిగితే మరో కొత్త సమస్య ఉత్పన్నమవుతుందనే గుబులు కూడా వెంటాడుతున్నది.
ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు బీఆర్ఎస్‌ను విస్తరింపజేయడంలో ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులపై సుదీర్ఘంగా కసరత్తు జరిగిన తర్వాతనే ప్రక్రియను మొదలుపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాయలసీమ హక్కుల సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ఆ ప్రాంత నేతలతో మాట్లాడిన తర్వాత స్పష్టత రానున్నది. రాయలసీమ వెనకబాటుతనానికి గురైందనే భావన ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నందున అభివృద్ధికి కేసీఆర్ చూపే మార్గాలకు అనుగుణంగా అక్కడి నేతలు, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వైఖరి వెల్లడి కానున్నది. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో కొద్దిమంది రాయలసీమ నేతలతో కేసీఆర్ జరుపుతున్న చర్చల అనంతరం క్లారిటీ ఏర్పడే అవకాశం ఉన్నది.
Also Read...