మెదక్ కాంగ్రెస్‌లో ED భయం.. మరో కీలక నేతకూ నోటీసులు!

by GSrikanth |   ( Updated:2022-10-01 04:11:06.0  )
మెదక్ కాంగ్రెస్‌లో ED భయం.. మరో కీలక నేతకూ నోటీసులు!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఎన్ఫోర్స్ మెంట్(ఈడీ) భయం పట్టుకున్నది. నేషనల్ హెరాల్డ్‌కు విరాలాళిచ్చారనే నేపథ్యంలో ఈడీ నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ గీతారెడ్డికి మొదట నోటీసులు రాగా.. తాగాజా రెండు రోజుల క్రితం పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్‌కూ నోటీసులు అందాయి. అక్టోబర్ 12న డిల్లీలోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని గాలికి ఈడీ ఆదేశించింది. కాగా, ఢిల్లీలోనే మకాం వేసిన గాలి అనిల్ కుమార్ నోటీసులపై ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని, కావాలని ఇలా నోటీసులు పంపి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నదని ఆరోపిస్తున్నారు.


మొదట గీతారెడ్డి.. ఇప్పుడు గాలి అనిల్

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలకు ఈడీ నోటీసులు పంపడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ లీడర్‌గా, మాజీ మంత్రిగా డాక్టర్ గీతారెడ్డికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాలాళిచ్చారని ఈడీ ఇటీవల గీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది. గీతారెడ్డితో పాటు రాష్ట్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారితో పాటు గాలి అనిల్ కుమార్ కూడా ఈ నెల 28న ఈడీ నుంచి నోటీసులు తీసుకున్నారు. గతంలో అనిల్ కుమార్ నేషనల్ హెరాల్డ్‌కు కొంత మొత్తం డబ్బులు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. రికార్డులో పరిశీలనలో భాగంగా గాలి పేరు బయటపడడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, ఎంత మొత్తంలో ఇచ్చారు..? ఎప్పుడు ఇచ్చారనేది తెలియాల్సి ఉన్నది. అయితే, ఒకే జిల్లా నుంచి ఇద్దరు నేతలు ఈడీ నోటీసులు అందుకోవడం జిల్లా పార్టీలో కలకలం రేపుతోంది.

ముఖ్యనేతలే టార్గెట్

బీజేపీ కక్ష్యపూరితంగా ఈడీ పేరుతో కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్నదని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసినప్పటికీ ఎప్పటి నుంచో నేషనల్ హెరాల్డ్ ఉన్నదంటున్నారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ఎవరినీ పార్టీలో పనిచేయకుండా చూడాలని బీజేపీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. కాగా నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. గాలి అనిల్ కుమార్ కూడా ఢిల్లీల్లోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు. పార్టీ అధిష్టాన పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. తాము ఎలాంటి అక్రమాలు చేయలేదనే ధీమాతో ఉంటూనే ఈడీ కావాలుకుని టార్గెట్‌గా ఇబ్బలుందులకు గురిచేసే అవకాశం ఉన్నదని ఒకింత భయాందోళనకు గురవుతున్నట్లు ఈడీ నోటీసులు అందుకున్న వారి సన్నిహితులు చెబుతున్నారు. విచారణల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే పనిలో బీజేపీ ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు.

'ఆర్థికంగా ఆగమే తప్ప పదవులు లేని 'గాలి'

ఏ పార్టీలో ఉన్నా గాలి అనిల్ కుమార్ ఆర్థికంగా పార్టీ కార్యక్రమాలకు సహకారం అందిస్తుంటారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం మొదలైనప్పటి నుంచి పనిచేశారు. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ భారీ స్థాయిలో ఏ పెద్ద కార్యక్రమం చేపట్టినా గాలి సాయం తీసుకునేది. కోట్లు ఖర్చు పెట్టుకున్నప్పటికీ టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌లో కూడా పెద్ద కార్యక్రమాల నిర్వహణకు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్‌లో కూడా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్ చెరు టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గాలి అనిల్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గాలి అనిల్ కుమార్‌ను ఆర్థిక అవసరాల కోసం వాడుకుంటుందని పార్టీలో విస్త్రతంగా ప్రచారం ఉన్నది. రెండు పార్టీలో బాగా పనిచేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పదవులు అలంకరించకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన మరెన్ని ఇబ్బందులు ఎదుర్కోనున్నారో చూడాలి.

ఈడీ నోటీసులపై నోరు మెదపని జిల్లా నేతలు

ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ప్రధాన నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. కాంగ్రెస్ కంచుకోటగా వెలుగొందిన మెదక్ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయిందనడానికి ఇదో నిదర్శనంగా చెప్పకోవచ్చు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈడీ నోటీసులపై స్పందించినప్పటికీ కేవలం రాహుల్ గాంధీ అంశాన్నే మాట్లాడారు. జిల్లా నేతల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలోనే పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఏం మాట్లాడితే ఏం జరుతుందో అనే భయంతోనే నాయకులు మాట్లాడడం లేదని విమర్శలు వస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నా కాంగ్రెస్ ముఖ్య నేతల మౌనాన్ని కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా ఈడీ నోటీసులతో జిల్లా కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితులు నెలకొన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: సర్కార్ కీలక ఉత్తర్వులు.. గిరిజనులకు కేసీఆర్ దసరా గిప్ట్

Advertisement

Next Story