AP Politics: లోకేశ్ రెడ్ బుక్‌‌లో ఎరేజర్లు ఉన్నాయా?

by Indraja |   ( Updated:2024-06-08 07:36:32.0  )
AP Politics: లోకేశ్ రెడ్ బుక్‌‌లో ఎరేజర్లు ఉన్నాయా?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రెడ్‌ బుక్.. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌లోని పలువురు ఉన్నతాధికారులు, అధికారులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో విధి నిర్వహణలో తమ హద్దులు, నియమ నిబంధనలు మర్చిపోయి వైసీపీ నేతలకు వంత పాడిన, వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేసిన అధికారులు ఇప్పుడు తమ భవిష్యత్ ఏమిటో అని కలవరపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. వారిప్పుడు రెడ్ బుక్ నుంచి తప్పించుకొనేందుకు రాజకీయాన్ని వ్యాపారంగా చేసే కొందరు సీనియర్ తెలుగుదేశం నేతల చుట్టూ తిరుగుతున్నారు.

ఏమిటీ రెడ్ బుక్?

వైసీపీ నేతల సూచన మేరకు, ప్రభుత్వ పెద్దల కళ్లలో ఆనందం కోసం కొందరు అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలను వేధింపులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారు. వారినెవ్వరిని వదిలి పెట్టేది లేదని అందరి పేర్లు తాను రెడ్ బుక్‌‌లో రాస్తున్నానంటూ యవగళం సభల్లో ఆ పుస్తకం చూపించారు. తమ ప్రభుత్వం వచ్చాక వీరందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా హెచ్చరించడం నిబంధనలకు విరుద్ధం అంటూ సీఐడీ అధికారులు లోకేశ్‌పై కోర్టులో కూడా పిటిషన్ వేశారు.

రెడ్ బుక్ అమలు అవుతుందా?

ఇప్పుడు ఆ రెడ్‌బుక్‌ను అమలు చేసే అవకాశం టీడీపీ యవనేత నారా లోకేష్‌కు వచ్చింది. అందుకే అధికారులు గుబులు పడుతున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలే చాన్సే లేదంటూ నారా లోకేశ్ పదేపదే చెబుతూ వచ్చారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అయితే, రెడ్ బుక్‌ను అమలు చేయరా? అని ప్రశ్నించినప్పుడు కక్ష సాధింపులు ఉండబోవని చెప్పానే కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని స్పష్టం చేశారు.

కొంత మంది అధికారుల్ని కలిసేందుకు చంద్రబాబు నిరాసక్తత

తాము ప్రతిపక్షంలో ఉండగా కొంత మంది అధికారులు వ్యవహరించిన తీరు.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదన్న సంకేతాలనే పార్టీ ఇస్తోంది. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ చాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు.

ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సీఐడీ చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవు పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామాంజనేయులు, సీనియర్ ఐపీఎస్.. చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు.

వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్‌ బుక్‌లో ఉన్నారని భావిస్తున్నారు.

తప్పుడు కేసులు పెట్టిన వారందరికీ గడ్డు కాలమేనా?

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా యాభై రోజులకుపైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్నీ తప్పుడు కేసులేనని, తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల్ని వదిలేది లేదని స్పష్టం చేసింది. సీఐడీ చీఫ్‌గా ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు పని చేశారు.

ఒకరు పీవీ సునీల్ కుమార్ కాగా, మరొరకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

డిప్యూటేషన్ అధికారులు కీలకం!

రెడ్ బుక్‌లో ఉన్న వారిలో ఉన్న డిప్యూటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డిప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డిప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు.

స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ పెట్టుకున్నారు. గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అదే చేశారు. ఇక సాక్షితో పాటు వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్‌ను తన చేతులపై నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నారు.

వాసుదేవ రెడ్డిపై శుక్రవారమే సీఐడీ దాడి జరిగింది. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవర్నీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవును కూడా తిరస్కరించారు. సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.

తప్పించే ధైర్యం చేయగలరా?

కొందరు సీనియర్ నేతలు అష్టకష్టాలు పడి సీట్లు సాధించి జగన్ వ్యతిరేక గాలిలో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు కష్టాల్లో వున్నప్పుడు పట్టించుకోకుండా చివరి నిముషంలో పైరవీలు, వత్తిడులతో టికెట్లుపొందిన వీరికి పార్టీలో వ్యాపారులుగా పేరుంది. వీరికి పార్టీ ప్రయోజనాలకంటే తమ వ్యాపారాలే ముఖ్యం. ఇందులో కొందరికి వైసీపీ నేతలు కూడా భారీగా ఎన్నికల ఫండ్ సమకూర్చడం గమనార్హం. అటువంటి వారి చుట్టూ ఇప్పుడీ అధికారులు తిరుగుతున్నారు.

వారి ద్వారా తమపై చర్యలు లేకుండా వుండేందుకు పైరవీలు ప్రారంభించారు. అయితే, వీరి మాట ఈ సారి చంద్రబాబు వినే అవకాశం లేదని అంటున్నారు. చంద్రబాబు కాస్త మెత్తబడినా తన రెడ్ బుక్ లోనుంచి వీరి ప్రమేయంతో అధికారులు పేర్లను ఏరేజ్ చేయడం అసాధ్యమని లోకేష్ నమ్మకంతో వున్నారు. ద్రోహులను శిక్షించకుంటే ఐదేళ్లు అష్టకష్టాలు పడ్డ పార్టీ క్యాడర్‌కు న్యాయం చేసినట్లు అవదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed