రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు: సీఎల్సీ నేత భట్టి

by Kalyani |
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు: సీఎల్సీ నేత భట్టి
X

దిశ, కొందుర్గు: కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయని కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారని ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క తలపెట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర షాద్ నగర్ నియోజకవర్గంలోకి చేరింది. ఈ సందర్బంగా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రేగడి చిలకమర్రి, షాబాద్ మధ్య జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ తో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ విజయయాత్ర తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ నుంచి ఢిల్లీకి చేరుకుని ఎర్రకోటపై విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. కర్ణాటకలో ప్రజలు బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమానంగా గౌరవించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న గొప్ప అనుభవం గల యువనాయకుడు రాహూల్ అని ఆయన సభ్యత్వాన్ని కేంద్రం రద్దు చేసిందని, బీజేపీ చర్యలు గమనించిన కర్ణాటక ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టి అంబానీ, ఆదానిలకు దోచిపెడుతుంటే.. ప్రజల సంపద ప్రజలకే ఉండాలని రాహుల్ గాంధీ చేసిన పోరాట ఫలితమే కర్ణాటక కాంగ్రెస్ విజయంగా చూడవచ్చు అన్నారు.

పేదల భూమిని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం న్యాయమేనా..?

తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు బతకడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమిని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం న్యాయమేనా అని మంత్రి కేటీఆర్ ను భట్టి ప్రశ్నించారు.పేద ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రినా ? బహుళ జాతి కంపెనీలకు సీఈవోగా పనిచేస్తున్నరా ? అంటూ మంత్రి కేటీఆర్ పై భట్టి తీవ్రంగా ఫైర్ అయ్యారు. చందనవెళ్లి గ్రామంలో పేదలు, దళితులకు చెందిన 2వేల ఎకరాలను బలవంతంగా గుంజుకుని బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. సీతారామస్వామి ఆలయానికి చెందిన 1500 ఎకరాలను మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టడం అన్యాయమని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మసిటీ కొరకు పేదలకు పంచిన భూములను రాబందులుగా ప్రభుత్వ పెద్దలు గుంజుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.

Advertisement

Next Story

Most Viewed