వివాదాల సుడిలో విశ్వవిద్యాలయం.. ఏయూలో మరో కుంభకోణం

by Indraja |
వివాదాల సుడిలో విశ్వవిద్యాలయం.. ఏయూలో మరో కుంభకోణం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: నియంతగా ఏయూను ఏలిన మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి పాలనలో చట్టాలు, నిబంధనలకు చోటే లేదు. ఆయన చెప్పిందే చట్టం. చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహారాలు సాగాయి. అందులో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ ఎస్‌ఐ‌బీ) పేరుతో మాజీ వీసీ ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్‌లు కోట్ల రూపాయలను ప్రత్యేక అకౌంట్ తెరచి కొట్టేశారనే ఆరోపణలు కొత్త ప్రభుత్వానికే షాక్ ఇస్తున్నాయి.

సిబ్బు పేరిట గబ్బు ..

ప్రసాదరెడ్డి ఆలోచనలతో ఏర్పడ్డ ఏయూ సిబ్బులో ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. విశ్వవిద్యాలయంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్‌లను కాదని, ప్రైవేటు కళాశాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఈ కోర్సుకు సంబంధించి పూర్తి హక్కులు కట్టబెట్టడంపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

సారబందీ ఖాతాలో కోట్లు

పైడా కాలేజీ నుంచి బయటకు పంపబడిన ఎస్.సారబందీ అనే వ్యక్తిని తమ బినామీగా ప్రసాదరెడ్డి, కృష్ణమోహన్ జంట అడ్డదారిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరుతో యూనివర్సిటీలోకి తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయనకు డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో సీనియర్ ఆచార్యులు విశ్వనాధం, సాంబశివరావు, మోహన్ వెంకట్రామ్, జాలాది రవి, కిశోర్ బాబులు ఉండగా బయట నుంచి అడ్డదారిలో తెచ్చిన వ్యక్తిని స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించడం వెనుక కోట్లాది రూపాయల స్కాం స్కీం వుండడమే కారణమంటూ కొందరు ప్రొఫెసర్లు నేరుగా విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ను కలసి ఫిర్యాదు చేశారు.

యూనివర్సిటీ రిజిస్ట్రార్ అకౌంట్‌తో సంబంధం లేకుండా సారబందీ పేరుతో ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రత్యేకంగా వేరే బ్యాంకు అకౌంట్ ద్వారా కోట్లాది రూపాయల ఫీజు, నగదు లావాదేవీలు చేయడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోందని దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారు.

రూ.50 కోట్ల ఫీజులు ఏమయ్యాయో?

సుమారు వేయి మంది విద్యార్థులు ఒక్కొక్కరు కోర్స్ కోసం రూ.4.50 లక్షల చొప్పున చెల్లించారు. అంటే ఒక్క ఫీజు ద్వారానే ఇప్పటికి సుమారు రూ.46 కోట్లు ఈ ప్రత్యేక అకౌంట్‌లో జమ అయ్యాయి. యూనివర్సిటీలోని ప్రతీ ఫీజు రిజిస్ట్రార్ అకౌంట్‌లో జమ అవుతుంది. అదే ప్రభుత్వ నిబంధన. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లావాదేవీలు మాత్రం ప్రసాదరెడ్డి, కృష్ణమోహన్‌లు చాలా రహస్యంగా వుంచి మరో ఖాతా తెరిచారు.

కృష్ణ మోహన్ ఆ సమయంలో రిజిస్ర్టార్‌గా వుండి కూడా రిజిస్ర్టార్ ఖాతాలో ఫీజులు కట్టించకపోవడం చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్‌కి కూడా ఈ అకౌంట్ గురించి తెలియదంటే ఏ స్థాయిలో నిబంధనలను తుంగలో తొక్కారో అర్థమవుతుంది. ఈ వ్యవహారాల గురించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌కి గాని, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాధిపతికి గాని తెలియకుండా, వారు ప్రశ్నించకుండా వీసీ, రిజిస్ట్రార్‌లు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వీసీ ప్రసాద రెడ్డి, కృష్ణమోహన్, సారబందీ త్రయానికి మాత్రమే దీని ఆర్థిక వ్యవహారాల మీద పట్టు వుందనే ఆరోపణలపై ఇప్పుడు ఫిర్యాదులు వెళ్లాయి.

పేరు ఇంటర్నేషనల్.. స్థాయి లోకలే..

పేరుకే ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్, లోపల అంతా లోకలే. నాణ్యత లేని తమకు కావాల్సిన వారిని అడ్డదారిలో విద్యాబోధన కోసం నియమించుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంటర్మీడియట్ అయ్యాక మూడు సంవత్సరాలు చదివితే బ్యాచిలర్ డిగ్రీ, మరో రెండు సంవత్సరాలకు ఎంబీఏ డిగ్రీ ఇస్తామన్నారు. జాయిన్ అయిన వెంటనే ఇక్కడి విద్యాబోధనకు కంగు తిని ఇతర ప్రయివేటు యూనివర్సిటీ లకు విద్యార్థులు మారిన ఉదంతాలు ఎన్నో వున్నాయి.

ఇంటర్నేషనల్ పేరు చూసి జాయిన్ అయ్యానని ఏదోలా మూడు సంవత్సరాలు నెట్టుకొచ్చానని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ విద్యాబోధన చాలా దారుణంగా వుంది. తమకు "ఇష్టులు" కావాల్సిన వారికి మంచి మార్కులు వేస్తారని, ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుందంటూ? ఐదు లక్షలు కట్టి మోసపోయామని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. తాను రిటైర్ అయ్యాకా ఈ స్కూల్ డైరెక్టర్ అవుదామనుకున్న మాజీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్‌కు భంగపాటు ఎదురైంది. ఆయనను గౌరవ ఆచార్యుడిగా కూడా ప్రసాదరెడ్డి గుర్తించకపోవడంతో ఆయన షాక్‌లో‌కి వెళ్లినట్లు తెలిసింది.

ఇక నుంచి ఫీజులు ఏయూ ఖాతాకు..

కొసమెరుపు ఏమిటంటే వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా చేయడంతో కంగుతిన్న సారబందీ ఇప్పటి నుంచి ఫీజులు రిజిస్ట్రార్ అకౌంట్‌లో జమ చేయాలని విద్యార్థులకు తెలిపారు. యూనివర్సిటీ నిధులను కైంకర్యం చేసిన సారబందీని అరెస్ట్ చేసి, తక్షణం యూనివర్సిటీ మేనేజిమెంట్ విభాగ ఆచార్యుల ఆధీనంలోకి స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌ను తీసుకురావాలని మంత్రి నారా లోకేశ్‌ను ఏయూ ఆచార్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story