- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక బరిలో క్రిమినల్స్.. ఏడీఆర్ నివేదికలో సంచలన విషయాలు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ (మే 10) సమీపించిన తరుణంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. గతంతో పోలిస్తే ఈసారి కర్నాటక పోల్స్‌లో పోటీచేస్తున్న వారిలో నేరచరితుల సంఖ్య పెరిగిందని ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 31 శాతం మంది, బీజేపీకి చెందిన 30 శాతం, జేడీఎస్‌కు చెందిన 25 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ నుంచి గత ఎలక్షన్‌లో క్రిమినల్ రికార్డ్ కలిగిన 59 మంది పోటీ చేయగా ఈసారి అలాంటి అభ్యర్థుల సంఖ్య 122 మందికి పెరగడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన వారిలో 83 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 96కు పెరిగింది. నేరచరితులైన క్యాండిడేట్స్ జేడీఎస్‌లో గతంలో 41 మంది ఉండగా.. ఇప్పుడు 70 మంది అయ్యారు.
ఆప్ అభ్యర్థుల్లో 30 మంది నేరచరితులు ఉన్నారు. కర్నాటక అసెంబ్లీ పోల్స్ లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో ఎనిమిది మందిపై హత్యానేరం (ఐపీసీ సెక్షన్ 302), 35 మందిపై హత్యాయత్నం నేరం (సెక్షన్ 307) , 49 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక అభ్యర్థిపై అత్యాచార కేసు ఉంది. మొత్తం మీద 404 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై, బీజేపీ అభ్యర్థుల్లో 43 శాతం మందిపై, జేడీ(ఎస్) అభ్యర్థుల్లో 34 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదికలో ప్రస్తావించారు. మొత్తం 2586 మంది క్యాండిడేట్స్‌లో 581 (22 శాతం) మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటుండగా, 16 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
224లో 111 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలే..
కర్నాటకలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం (224లో 111) రెడ్ అలర్ట్ నియోజకవర్గాలే అని ఏడీఆర్ నివేదిక తెలిపింది. అంటే.. ఈ నియోజకవర్గాల నుంచి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లలో స్వయంగా ప్రకటించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు 56 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 70కి పెరిగింది. అత్యధికంగా ఏడుగురు నేర చరితులైన అభ్యర్థులు బరిలో ఉన్న బైటరాయణపుర నియోజకవర్గం రెడ్ అలర్ట్ నియోజకవర్గాల్లో మొదటి ప్లేస్ లో ఉంది. కాగా, 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
అభ్యర్థులంతా కోటీశ్వరులే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, విద్యార్హత, లింగం, ఇతర వివరాలను కూడా ఏడీఆర్ విడుదల చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 8 శాతం మంది మహిళలు ఉండగా.. ఈసారి 7 శాతం మందే ఉన్నారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న మొత్తం 2,615 మంది అభ్యర్థులకుగానూ 2,586 మంది స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్‌లను విశ్లేషించి.. వాటిలోని సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని ఏడీఆర్ తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్న అభ్యర్థుల సంఖ్య 447 ఉండగా .. ఈసారి అంత రిచ్ క్యాండిడేట్స్ సంఖ్య 592కు పెరిగింది. రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆస్తులున్న క్యాండిడేట్స్ సంఖ్య 252 నుంచి 272 కు పెరిగింది. రూ.కోటికిపైగా ఆస్తి కలిగిన క్యాండిడేట్స్ కాంగ్రెస్ లో 97 శాతం మంది, బీజేపీ లో 96 శాతం మంది ఉండగా.. జేడీ(ఎస్)లో 82 శాతం మంది, ఆప్‌లో 51 శతం మంది ఉన్నారు.
అలాంటి వాళ్లపై శాశ్వత అనర్హత వేటు వేయాలని సిఫార్సు
హత్య, అత్యాచారం, స్మగ్లింగ్, దోపిడీ, కిడ్నాప్ వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన అభ్యర్థులపై శాశ్వత అనర్హత వేటు వేయాలని ఏడీఆర్ సిఫారసు చేసింది. తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. తమపై కేసులున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి మంత్రులు కూడా అవుతారని, ఇది చట్టం ముందు అసమానతను ప్రదర్శిస్తోందని కర్ణాటక ఎలక్షన్ వాచ్ స్టేట్ కోఆర్డినేటర్ కాత్యాయిని చామరాజ్ వ్యాఖ్యానించారు. '' లా కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన 244వ నివేదికలో ఛార్జిషీట్లు దాఖలు చేసిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది. కానీ అది జరగలేదు. అలాంటి అభ్యర్థులను ఎన్నుకోకుండా తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం ఓటర్ల చేతుల్లోనే ఉంది’’ అని చామరాజ్ అన్నారు.