ఓరుగల్లులో పొలిటికల్‌ వార్

by Shyam |
ఓరుగల్లులో పొలిటికల్‌ వార్
X

దిశ, వరంగల్: బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలతో ఓరుగల్లులో రాజకీయలు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు భూకబ్జాదారులంటూ ఎంపీ చేసిన ఆరోపణలు టీఆర్ఎస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. ఎంపీ వాఖ్యలను తప్పు పడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం పైనే కాకుండా ఎంపీ కాన్వాయ్‌పై దాడికి దిగడంతో సంచలనం రేకెత్తించింది. ప్రతిగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలతో ప్రశాంతంగా ఉన్న ఓరుగ్లలులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

వివాదాస్పదమైన ఎంపీ వ్యాఖ్యలు..

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం వరంగల్‌కు వెళ్లారు. హన్మకొండలోని‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మోదీ పాలనలో కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత నిజమాబాద్‌లో కాలేజీ స్థలం ఆక్రమించారని.. వరంగల్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్,‌ నరేందర్ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి ఎంజీఎం ఆస్పత్రిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రకాళీ దేవాలయంలో అమ్మ వారిని దర్శించుకుని తిరిగి బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్తున్న ఎంపీ కాన్వాయ్‌ని మార్గ మధ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని కోడిగుడ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీ కాన్వాయ్ పై దాడికి దిగడంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్‌పై ముట్టడికి బయలు దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు బీజేపీ నేతలను అడుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎంపీపై ఎమ్మెల్యే ల కౌంటర్..

నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రెస్‌మీట్ పెట్టి ఆయనకు సవాల్ విసిరారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అరవింద్ ఇక్కడికొచ్చి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కబడ్దార్ బీజేపీ నాయకుల్లారా మాజోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. మీరు అభివృద్ధి చేయరు, మమ్మల్ని చేయనివ్వరా అని ప్రశ్నిచారు. రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 అరవింద్ అని విమర్శించారు. రాజస్థాన్ యూనివర్సిటీలో తప్పుడు ధృవపత్రాలు తెచ్ఛి ఎంబీఏ పాస్ అయ్యానని చెప్పుకున్నారని ఆరోపించారు. కవితపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రశాంతంగా ఉన్న వరంగల్‌లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర దాడులు, మాటల యుద్ధం సంచలనం కలిగిస్తోంది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని ఇరు పార్టీల‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed