చిరంజీవి వర్సెస్ పవన్ కల్యాణ్?

by srinivas |   ( Updated:2020-02-15 04:43:07.0  )
చిరంజీవి వర్సెస్ పవన్ కల్యాణ్?
X

పవన్ కల్యాణ్‌తో చిరంజీవి ఢీ కొట్టనున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీరిద్దరూ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశముందని గతంలో పుంఖానుపుంఖలుగా కథనాలు వచ్చాయి. విశేషమైన సినీ అభిమానులు గల వీరిద్దరూ రాజకీయ రంగప్రవేశం చేస్తే.. రెగ్యులర్ రాజకీయనాయకులంతా తట్టాబుట్ట సర్దేసుకోవాల్సి ఉంటుందని అంతా భావించారు. అయితే అంచనాలను అందుకోవడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. ఫలితంగా రాజకీయాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మిగిలింది.

ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేస్తే.. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. చిరంజీవి ఆచితూచి మాట్లాడితే.. పవన్ కల్యాణ్ పంచెలూడదీసి కొడతా అంటూ దూకుడైన వ్యాఖ్యలు చేసి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వీరిద్దరూ రాజకీయాల్లో పెనుమార్పు తెస్తారని అప్పట్లో ప్రజలు భావించారు. అయితే అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి షాకిచ్చారు. అప్పుడే పవన్ కల్యాణ్ తన అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ చిరంజీవి అభిప్రాయానికి గౌరవమిచ్చాడు.

రాష్ట్ర విభజన తనను బాధకు గురిచేసిందంటూ జనసేన పార్టీని పవన్ కల్యాన్ పెట్టాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చి ఆ పార్టీలు గెలవడానికి కారణమయ్యాడు. ఆ తరువాత టీడీపీకి బాసటగా నిలుస్తూ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై ఘాటు విమర్శలు చేశాడు. 2019 ఎన్నికల్లో సొంతగా పోటీ చేశాడు. రెండు స్థానాల్లో తానే స్వయంగా నిలబడ్డాడు. అయితే ప్రజలు ఆయన టీడీపీకి మద్దతివ్వడాన్ని అంగీకరించలేదు. దీంతో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా విజయాన్ని కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దూకుడుగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు.

ఈ క్రమంలో వైఎస్సార్సీపీలోకి చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేస్తాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చిరంజీవి వైఎస్సార్సీపీలోకి వస్తే జనసేనానికి ఆ పార్టీ అతనితోనే చెక్ పెట్టే అవకాశముంటుంది. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీతో ఎలాంటి వైఖరి అవలంభించే అవకాశముంది. అదే సమయంలో చిరంజీవి వైఎస్సార్సీపీలో చేరితే..తమ పార్టీ అధినేతపై ఒంటికాలిపై లేచే జనసేనపై ఎలాంటి వైఖరి అవలంభించే అవకాశముందన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. గతంలో కొన్ని ఆడియో, రాజకీయ ఫంక్షన్లలో తానీ స్థాయిలో ఉండడానికి సినిమాలే కారణమైతే.. ఆ సినిమాల్లోకి రావడానికి అన్నయ్యే కారణమని, అన్నా వదినలు తనకు దేవుళ్లతో సమానమంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ రాజకీయాల్లో ఎలాంటి వైఖరి అవలంభించనున్నారు. పవన్ దూకుడికి చిరంజీవి కళ్లెం వేస్తారా?.. పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీతో కూడా బీజేపీ బేరసారాలాడుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను బీజేపీ మిత్ర ధర్మం పాటించమంటుందా? లేక వైఎస్సార్సీపీ చిరంజీవితో చెక్ చెబుతుందా? అన్నదమ్ములిద్దరు రాజకీయాల్లో భాగంగా నువ్వెంతంటే నువ్వెంత అంటూ విమర్శలు చేసుకుంటారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed