ప్రజలపై ప్రజాప్రతినిధుల రౌడీయిజం?

by Anukaran |
ప్రజలపై ప్రజాప్రతినిధుల రౌడీయిజం?
X

దిశ, శేరిలింగంపల్లి: ‘తమాషాలు చేస్తున్నవా.. నీ అడ్రస్​ చెప్పు.. అక్కడికి వచ్చి నరికేస్తా.. నీ అంతు చూస్తా.. ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకో.. ఎస్పీకా, డీజీపీకా ఎవరికైనా చెప్పుకో’ అంటు ఒకరు. పదిమందికి ఇబ్బంది అవుతుందని అడిగితే.. నీకే వస్తోందా కష్టం అంటూ చేయి చేసుకోవడం ఇలా లీడర్లు బోర్డర్​దాటి మాట్లాడడమే కాదు చేయి చేసుకుంటున్నారు. లాంగ్వేజ్​ పక్కాగా రౌడీలను మించి ఉంటోంది.. సామాన్యులు వింటే జడ్సుకునేలా ఉంది.

అడిగితే తిడుతా.. ప్రశ్నిస్తే కొడుతా..నేటి ప్రజాప్రతినిధుల తీరిది. ప్రజల నమ్మకం.., ఓట్లతో గెలిచిన నాయకులు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అందలమెక్కామన్న పొగరుతో గీత దాటుతున్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి గెలిపించిన వారినే గేలి చేస్తున్నారు. తీరు మార్చుకోని తిట్లదండకాన్ని చదవుతున్నారు. అవసరానికి అనుగుణంగా రంగులు మార్చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు దండాలు పెడుతూ.. అక్కెర తీరిన తర్వాత చేతికి పని చెబుతున్నారు. అయ్యా.., అమ్మ అని పిలిచిన నోటితో నానా బూతులు తిడుతున్నారు. ఓట్ల సమయంలో తప్పితే ప్రజలంటే వారికి కనీస పట్టింపు లేకుండా పోతోంది.

ఒకప్పుడు నాయకులంటే ప్రజలకు సేవచేస్తూ అనునిత్యం వారితో కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా.. మేమున్నాం అంటూ పరుగున వచ్చేవారు. అండగా నిలబడి గెలిచే వరకూ పోరాడేవారు. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధుల తీరు మారింది. అధికారం చేజిక్కితే చాలూ.. ఎవడైతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మంత్రి, ఎమ్మెల్యే, కార్పొరేటర్ అనే తేడా లేదు. అందరూ అందరే. ఇటీవల కాలంలో ఈ తరహా ధోరణి మరీ శృతిమించుతోంది. ఏదైనా విషయంపై సామాన్యుడు ప్రశ్నించడమే పాపం.. ప్రజాప్రతినిధిని అయిన నన్నే ప్రశ్నిస్తావా..? అంటూ పరుషపదజాలంతో నానా దుర్భాషలాడుతున్నారు. కొందరు నేతలైతే నోటికే కాదు.. చేతులకు సైతం పని చెబుతున్నారు. తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇటీవల జరిగిన రైతు బంద్ ధర్నాలో ఇదే తరహాలో ఓ సామాన్య వ్యక్తిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సమక్షంలోనే మిగతా చోటామోటా నేతలు రెచ్చిపోయి సామాన్యుడిపై దాడిచేశారు.

వీళ్లా మన నాయకులు..

ఇటీవల ప్రజా ప్రతినిధులకు నోటి దురుసు ఎక్కువయ్యిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో గళమెత్తాల్సిన ఎమ్మెల్యేలు అక్కడ ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు. సమస్యలపై ఏనాడు ప్రశ్నించడం రాదు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రజలపై నోరు పారేసుకుంటున్నారు. బల్దియా సమావేశంలో మాట మాత్రానికి నోరు విప్పని కార్పొరేటర్లు గల్లీలో మాత్రం ఆడ మగ అనే తేడాలేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే చోటుచేసుకున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓ కార్పొరేటర్ మహిళలపై నోరు పారేసుకోవడమే కాకా దాదాపు కొట్టినంత పని చేశారు.

అలాగే మరో ప్రజా ప్రతినిధి అధికార పార్టీ నేతనంటూ కాలనీలో హల్చల్ చేశారు. ఇలా చెప్పకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈపార్టీ.. ఆపార్టీ అనే తేడా లేకుండా ఛోటామోటా నాయకుల నుండి మొదలు నియోజకవర్గ స్థాయి నేతల వరకు అందరిదీ ఇదే వరుస. అలాగే ఇటీవల ఓ జర్నలిస్టు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నడంటూ ఎమ్మెల్యే ఫోన్ చేసి మరి బూతులు తిట్టాడు. అంతేకాదు.. చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అధికారంలో ఉన్నాం తమను ఎవరూ ఎం చేయలేరని అహంతో ఇలా సామాన్యులపై ప్రజాప్రతినిధులు జులుం ప్రదర్శిస్తున్నారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి.

చోద్యం చూస్తున్న పార్టీ పెద్దలు..

ఇంత జరుగుతున్నా..తమ పార్టీ నాయకులు రోజుకోరచ్చ చేస్తున్నా.. ఏనాడూ ఏ పార్టీ ఎవరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. కనీసం కింది స్థాయి కేడర్ ను సైతం మందలించిన సందర్భాలు కానరావు. ఇదంతా మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు వ్యవహరిస్తుండడం, పోలీసులు సైతం కేసులు పెట్టకపోవడంతో నాయకులు అని చెప్పుకునే వారికి నోటి దురుసుతనం ఎక్కువవుతుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed