- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటి వర్సెస్ తుమ్మల… ఎమ్మెల్సీ ఎవరికి? మంత్రి పదవి ఎవరికి?
దిశ ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఇన్నాళ్లూ ఏ పదవీ లేకుండా ఉన్న సీనియర్లకు మళ్లీ మంచిరోజులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాకు సంబంధించి ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటి కోసం ఆశావహులు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే గులాబీ బాస్, యువనేత దృష్టి మాత్రం కొందరిపైనే ఉందని సమాచారం. అంతేకాదు ఈటల పరిణామాల అనంతరం మంత్రి వర్గ విస్తరణ లేదా.. కాబినేట్‌లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు వీరిని పక్కకు పెట్టిన అధిష్టానం.. భవిష్యత్ రాజకీయ పరిణామా దృష్ట్యా వీరికి ప్రాధాన్యత కల్పించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎలాంటి నిర్ణయం రాకముందే.. ఇద్దరు నేతల అనుచరగణం మాత్రం ఎవరికి వారు తమ నేతకు పదవి ఖాయం అంటూ చెప్పుకొస్తున్నారు.
సీనియర్లకు మంచిరోజులు వచ్చేనా..?
రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి తెలియని వారుండరు. అలాంటిది టీఆర్ఎస్‌లో జాయిన్ అయిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి ప్రాధాన్యతను పార్టీ రోజురోజుకూ తగ్గిస్తూ వచ్చింది. చివరికి ఎలాంటి పదవులు లేకుండా చేయగలిగింది. దీంతో ఇద్దరు సీనియర్ నేతలూ సైలెంట్ గానే ఉన్నారు. ఇద్దరు నేతలకూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది. అభిమానులూ ఎక్కువే. తమ నాయకులను గులాబీ పెద్దలు కావాలనే పక్కకు పెట్టారని వారి అనుచరగణం, అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారాలంటూ ఒత్తిడి సైతం చేశారు. కానీ తుమ్మల, పొంగులేటి ఇద్దరికీ పార్టీ పెద్దల నుంచి ఎప్పటికప్పుడు హామీలు వస్తూనే ఉన్నాయి తప్ప పదవి మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు ఎదురుచూసే ధోరణిలోనే ఉన్నట్లు వారి అభిమానులే చెబుతున్నారు.
మంత్రి పదవిపైనే ఇద్దరి గురి..
పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లకు ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమను మంత్రిని చేస్తేనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వండంటూ ఇద్దరూ అధిష్టానం పెద్దలకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఈటల పరిణామాలు ముగిసిన అనంతరం కాబినేట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సారైనా తమకు మంత్రి పదవి వరించాలని ఇద్దరు నేతలు బలంగా కోరుకుంటున్నారు.
పొంగులేటికే చాన్స్..?!
ఒకవేళ మంత్రి పదవిని ఇచ్చే అవకాశమే ఉంటే వీరిలో పొంగులేటికే ఎక్కువగా చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చేరిన తనకు పార్టీ అధిష్టానం ఎన్నోసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదనే అసంతృప్తి పొంగులేటికి, ఆయన వర్గీయులకు ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒక వేళ పార్టీ మారితే భారీ కుదుపు తప్పదని భావించిన యువనేత కేటీఆర్.. పొంగులేటితో ఎన్నోసార్లు మంతనాలు జరిపి ‘కచ్చితమైన హామీ’ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అధిష్టానం నుంచి భరోసా ఉంది కాబట్టే పొంగులేటి సైతం గతంలో ‘పదవి వచ్చేది ఉంటే ఎవరూ ఆపలేరు..’ అనే వ్యాఖ్యలు సైతం చేశారు. అంతేకాదు శ్రీనివాస రెడ్డి ఇప్పుడు కేటీఆర్ వర్గంగా ముద్ర పడ్డారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు అవకాశం ఇస్తే అది పొంగులేటికే సొంతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎవరినీ వదుకోలేని స్థితిలో..
గతంలో టీఆర్ఎస్ పార్టీలో విపరీతమైన వర్గ విభేదాలు ఉండేవి. అధిష్టానం సైతం తమకు దగ్గరగా ఉండేవారినే ప్రోత్సహించేవారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకోవడం, టీఆర్ఎస్ గ్రాఫ్ కొంతమేర పడిపోవడం, షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు కానుండడం, ఈటల పరిణామాలు వంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని గులాబీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎవ్వరినీ గతంలోలా నొప్పించకుండా ఉంటోంది. వర్గ విభేదాలు ఉన్నచోట్ల అందరికీ సర్దిచెబుతోంది. ఎప్పుడు ఎవరు ఎటువైపు పోతారో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ ఏ నేతకు ఇబ్బంది కలిగినా షర్మిల పార్టీ నుంచి చాలా వరకు టీఆర్ఎస్ పార్టీపై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావుకు సైతం ఓ ప్రాధాన్యత ఉండే పదవిని అధిష్టానం కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరులే చర్చించుకుంటున్నారు.