సిద్దిపేటలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం

by Shyam |   ( Updated:2021-04-16 04:40:13.0  )
సిద్దిపేటలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
X

దిశ సిద్దిపేట : సిద్దిపేట పుర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల చేయడంతో ప్రధాన రాజకీయ పక్షాలు కదనరంగంలోకి దూకుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మున్సిపల్ నగారా మోగడంతో సిద్దిపేట మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఎన్నికల ప్రకటనకు చాలా రోజుల ముందుగానే కార్యాచరణను ప్రారంభించాయి. ఈ అంశంలో అధికార టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై నడిపిస్తున్నారు. మిగిలిన రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ సమాయత్తం అవుతున్నాయి. సిద్దిపేట పురపాలికలో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్‌ కేంద్రాల వారీగా తుది జాబితా.. రిజర్వేషన్లు ఖరారు కావడం, ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కావడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. సిద్ధిపేట మున్సిపాలిటీలో గతంలో 34 వార్డులు ఉండగా, పునర్విభజన తరువాత అవి 43వార్డులకు చేరుకున్నాయి.

ఈసారి అన్ని వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెండు నెలలుగా ఆయన అదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్డ్ రాకముందే పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అన్ని వార్డులను చుట్టేశారు. ప్రధానంగా విద్యార్థులు, యువతను ఆకట్టుకునేందుకు ఇటీవల పట్టణ స్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా సోషల్ మీడియా కన్వీనర్లను ఏర్పాటు చేసి విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలో వివరిస్తున్నారు. ప్రతి వార్డుకు 23 నుంచి 25 మంది నియోజకవర్గంలోని పార్టీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. ఒక్కో వార్డులో వంద మంది ఓటర్లకు ఒక ప్రతినిధిని నియమించి ఓట్లు ఎలా రాబట్టాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. వారికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను కూడా రంగంలోకి దించుతున్నారు. టిక్కెట్‌ ఆశిస్తున్న ఔత్సాహిక నేతలతో తాజాగా సమావేశం నిర్వహించారు. సిట్టింగులకు టిక్కెట్‌ ఇస్తే ఎంతమంది గెలుస్తారు? ఎంతమందిపై వ్యతిరేకత ఉంది? వార్డుల్లో ఎవరికి టికెట్‌ ఇస్తే విజయం సాధిస్తారనే అంశంపై అంతర్గత సర్వే చేయించినట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ సిద్దిపేట పుర పోరులో సైతం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టించిన దుబ్బాక ఉపఎన్నికల్లో సాధించిన గెలుపుతో ఇక్కడ కూడా విజయకేతనం ఎగురవేస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వార్డుకు ఒక పార్టీ జిల్లా ఆఫీస్‌ బేరర్‌ను నియమించారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఇన్‌ఛార్జులను పార్టీ నియమించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్న నేతలతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నేటి నుంచే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సిద్దిపేట బల్దియా ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగారు. బీజేపీ కూడా సోషల్ మీడియా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రచారానికి రాష్ట్ర స్థాయి నేతలను రప్పించనున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ కూడా బల్దియా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డుల్లో పార్టీ పతాకాలు ఆవిష్కరించి పోటీ చేయాలని భావిస్తున్న నేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. టికెట్‌ ఖాయంగా వస్తుందని భావిస్తున్న కొందరు నేతలు వార్డుల్లో అంతర్గత ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. టికెట్‌ ఖాయంగా వస్తుందని భావిస్తున్న కొందరు నేతలు వార్డుల్లో అంతర్గత ప్రచారం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు… ప్రచారానికి రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలను రంగంలోకి దించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ప్రతి వార్డులో ఒక్కరికి మించి అభ్యర్థులు టిక్కెట్టు ఆశిస్తుండడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. టిక్కెట్లు ఆశించి భంగపడే నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడమో లేదా బీజేపీ, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద సిద్దిపేటలో మరో సమరానికి సమయం ఆసన్నమైందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story