కంటోన్మెంట్‎లో రాజకీయ వేడి

by Shyam |
కంటోన్మెంట్‎లో రాజకీయ వేడి
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో నామినేటేడ్ మెంబర్ నియామకం అనివార్యమైంది. దీంతో కంటోన్మెంట్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేటేడ్ పదవిని నియమించే అధికారం కేంద్రంలో చేతిలో ఉండడంతో.. పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలందరూ హస్తినా లో పాగా వేశారు. పదవిని తనకంటే తనకే ఇవ్వాలంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు, పైరవీలు మొదలుపెట్టారు. ఎవరికి వారు బీజేపీ ముఖ్య నేతల వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఇద్దరు మాజీ మంత్రులు, కంటోన్మెంట్ కు చెందిన ముగ్గురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

రేసులో ముగ్గురు మాజీ వీపీలు

బోర్డు నామినేటేడ్ సభ్యుడి రేసులో ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు ఉన్నారు. జంపనప్రతాప్, భానుక నర్మద మల్లీకార్జున్, జె.రామకృష్ణ తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. నామినేటేడ్ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే జంపనప్రతాప్ ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నాయకులతో పాటు రక్షణ శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించినట్లు సమాచారం. అదేవిధంగా తాజా మాజీ ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ సైతం ఐదారు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి నామినేటేడ్ పదవీని తనకే కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు తన సతీమణి భానుక నర్మద (మాజీ వీపీ)కు అవకాశం ఇవ్వాలని భానుక మల్లికార్జున తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ ఆశీస్సులతో ఎలాగైనా నామినేటేడ్ సభ్యురాలను చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం పలుమార్లు భానుక మల్లికార్జున్ బండి సంజయ్ తోపాటు పార్టీ పెద్దలను కలిసినట్లు తెలిసింది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు ఒక్కరు నామినేటేడ్ మెంబర్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది.

వేడెక్కిన బోర్డు రాజకీయం..

మొన్నటి వరకు పాలు నీళ్లలా కలిసి ఉన్న ముగ్గురు మాజీ ఉపాధ్యక్షులు ఎవరికి వారే పదవిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నామినేటేడ్ సభ్యుడి కోసం తనకు మద్దతు తెలుపాలని ఒక్కరంటే.., తనకు లాస్ట్ చాన్స్ ఇవ్వాలని ఓ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఎవరికివారుగా నామినేటేడ్ సభ్యుడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటూ..పార్టీలో తమ స్థాయి ఏమిటో నిరుపించుకోవాలని శ్రమిస్తున్నారు. ముగ్గురు వీపీలు ఢీ అంటే ఢీ అన్నట్లు పోస్టు కోసం పైరవీలు చేస్తుంటే.. మరో ఇద్దరు మంత్రుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ లోనే నివాసం ఉంటున్న రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి మాత్రం దళితుడిని నామినేటేడ్ సభ్యుడిగా నియమిస్తారంటా..? అని వ్యాఖ్యానిస్తూ మరో చర్చకు దారి తీశారు. దీంతో అనుహ్యంగా మాజీ మంత్రులు డాక్టర్ విజయరామారావు, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరితోపాటు మహాంకాళి సికింద్రాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేశ్, సీనియర్ నాయకులు దయానంద చారి, గడ్డం శ్రావణ్ కుమార్ పేర్లు మాత్రం నామినేటేడ్ సభ్యుడి రేసులో నానుతున్నాయి. అయితే వారం పది రోజుల్లో నామినేటేడ్ సభ్యుడిని నియమించే అవకాశం ఉండడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed