- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ మండలి పోరులో పొలిటికల్ గేమ్
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల మండలి ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. పోలింగ్ కోసం రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఓటర్లు ఇంకా క్యాంపుల్లోనే ఉన్నప్పటికీ.. వారిని తమవైపు తిప్పుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఫ్యామిలీ ప్లాన్అమలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో చర్చలు పెడుతున్నారు. ఆఖరి నిమిషం వరకూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు పార్టీల నేతలు అండగా నిలుస్తున్నారు. మండలి ఎన్నికల్లో పొలిటికల్గేమ్కొత్తగా సాగుతోంది. గతంలో మండలి ఎన్నికలు అధికార పార్టీకి వన్‌సైడ్‌లా ఉన్నా.. ఇప్పుడు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. అయితే గెలుపోటముల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఆయా జిల్లాల్లో బాధ్యతలు తీసుకున్న అమాత్యులు, ఎమ్మెల్యేలకు మాత్రం ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. విపక్ష నేతలు పోటీకి నిలబడకున్నా.. స్వతంత్రులకు మద్దతు ఇస్తూ అధికారపార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.
కరీంనగర్‌లో ‘ఈటల’
ఇక్కడ రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1,324 మంది ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్‌కు చెందినవారు 996 మంది. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది. అధికార పార్టీకి ఈటల రాజేందర్ రూపంలో వ్యతిరేకత వర్గం పెరిగింది. సర్దార్రవీందర్సింగ్ను ముందుంచినట్లు బహిరంగ ప్రచారమే. దీంతో స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కరీంనగర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రధాన దృష్టి పెట్టారు. సర్దార్‌ను గెలిపించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. క్యాంపుల్లో ఉన్న ఓటర్లను వదిలేసి కుటుంబాలను టార్గెట్ చేసి ప్లాన్ అమలు చేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా పాత రిజర్వేషన్లే అమల్లో ఉండటంతో మళ్లీ వారినే పోటీకి దింపుతామని, వారిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, ఇప్పుడు మండలి ఎన్నికల్లో మాత్రం తాను చెప్పినట్లు ఓట్లేయించాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కుటుంబాలకు హామీలిస్తున్నారు.
ఓటర్లను వదిలేసి ఫ్యామిలీ ప్లాన్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా మొన్నటి హుజురాబాద్ఉప ఎన్నికల తర్వాత చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు మళ్లీ ఈటలకు టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తాము అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడ్డామని, కానీ లోపాయికారికంగా మీకు చేశామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ఈటల రాజేందర్‌కు మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపించినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే వారందరినీ మరోసారి తనపై ఉన్న అభిమానం, ఉప ఎన్నిక తర్వాత తనతో చెప్పిన వాగ్దానాలను మరోసారి నిరూపించుకునే సమయం మండలి ఎన్నికలేనని వారికి సంకేతాలిస్తున్నారు.
కేవలం హుజురాబాద్సెగ్మెంట్లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈటల రాజేందర్ నుంచి రాయబారం వెళ్తోంది. టీఆర్‌ఎస్‌కు సరైన సమయంలో బుద్ది చెప్పే సమయం ఇదేనని, ఇప్పుడు ఇక్కడ దెబ్బ కొడితే తనపై బాంబులు పేల్చిన మంత్రులకు కూడా దిమ్మదిరుగుతుందనే కోణంలో మండలి ప్లాన్వేస్తున్నారు. ఓటర్లంతా క్యాంపుల్లో.. అధికార పార్టీ నేతల గుప్పిట్లో ఉండగా.. లోకల్‌గా మాత్రం వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులతో రాయబారం చేస్తున్నారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ వారికే అవకాశం ఇస్తామని, దానికి సంబంధించిన ఖర్చును కూడా తానే భరిస్తానని, వారిని ఎలాగైనా గెలిపించుకుంటానని హామీ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మంత్రులు.. స్థానిక నేతలను బెదిరిస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా అంతా తమవైపే ఉన్నారనే విధంగా చూపించుకునేందుకు క్యాంపుల నుంచే కొన్ని వీడియోలను బయటకు లీకు చేసిన విషయాలు తెలిసిందే.
ఆదిలాబాద్‌లో ఏలేటీ
ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నిక జరిగే ఒక స్థానానికి టీఆర్ఎస్నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాల్లో మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు 717 మంది టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో ఒకింత గుబులు రేపుతోంది. ఎందుకంటే నిధులు లేకపోవడం, సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలు ఈ సారి తమ ప్రతాపం చూపించాలనే అక్కసుతో ఉన్నారు. వీరికి కాంగ్రెస్‌నేత మహేశ్వర్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. పుష్ప తరుఫున ఓటర్లతో మాట్లాడుతున్నారు. క్యాంపుల్లో ఉండి, అందుబాటులోకి రాని వారికి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం పంపిస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కొంత గ్యాప్వచ్చిందనే అవకాశాన్ని ఇప్పుడు మహేశ్వర్‌రెడ్డి వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మంత్రికి దూరమైన నేతలంతా ఏలేటి సపోర్ట్ తో స్వతంత్ర అభ్యర్థికి జై కొట్టే పరిస్థితి ఉంది. పార్టీ పరంగా కాకుండా.. ప్రభుత్వంపై వ్యతిరేకత, గిరిజన నినాదంతో ఇక్కడ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు.
‘తాతా’కు సొంత పార్టీలోనే ఎఫెక్ట్
ఖమ్మం జిల్లాలోని స్థానానికి టీఆర్ఎస్నుంచి తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మందికిగాను టీఆర్‌ఎస్‌కు చెందినవారు 490 మంది, కాంగ్రెస్, ఇతర పార్టీలకు 116మంది ఉన్నారు. అయితే ఇక్కడ తాతా మధుకు సొంత పార్టీ నేతలే మద్దతుగా ఉండటం లేదు. అనూహ్యంగా టికెట్దక్కడంపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్.. మధు వెనక ఉండి మద్దతు కూడగట్టుతున్నాడు. అయితే క్యాంపునకు వెళ్లిన కొంతమంది నేతలే క్రాస్‌ఓటింగ్‌కు ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మధుకు మద్దతు ఇవ్వాలంటూ వామపక్షాల తరుఫున గెలిచిన వారితో అధికార పార్టీ ఒప్పందం చేసుకుంటోంది. దీంతో ఖమ్మంలో ఎర్రన్నలు గులాబీ అభ్యర్థికి అండగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీలో కొంతమంది తాతా మధుకు వ్యతిరేకంగా ఉండటంతో కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా.. కొన్ని ఓట్లైనా చీలుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెదక్‌లో జగ్గన్నకు బీజేపీ సాయం
మెదక్‌జిల్లా స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 1,026 మంది ప్రజాప్రతినిధుల్లో 777 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారున్నారు. మిగిలిన వారు 230 మంది కాంగ్రెస్‌కు చెందినవారే అయినప్పటికీ.. ఈ రెండు పార్టీల్లో స్వతంత్రులు, బీజేపీకి చెందిన వారున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అటు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వీరిలో కొంతమంది జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు సహాకరించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ 230 ఓట్లు రాకుంటే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. అంతే ధీటుగా ఆయన ఇతర పార్టీల నేతలను సైతం తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక విధంగా బీజేపీ నేతలు అక్కడ సాయంగా ఉంటున్నారు.
నల్గొండలో కాంగ్రెస్‌కు హెల్ప్
నల్గొండ జిల్లాలోని స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి ఉండగా.. ఇంకా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 1,271 మంది ప్రజాప్రతినిధులకు.. టీఆర్‌ఎస్‌కు చెందినవారు 991 మంది ఉన్నట్లు లెక్కలేసుకుంటున్నారు. కానీ వీరిలో కొంతమంది ఇతర పార్టీల నుంచి గెలిచినవారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కుందూరు నగేష్, వంగూరు లక్ష్మయ్య స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు ఓటర్లున్నారు. ఇప్పటి వరకు ఒక ఎంపీ నగేష్‌కు, మరో ఎంపీ, మరో ఎమ్మెల్యే లక్ష్మయ్యకు మద్దతుగా ఉన్నట్లు చర్చ జరిగింది. తాజాగా లక్ష్మయ్య మద్దతు కూడా నగేష్‌కు ఇప్పించేలా చర్చలు సాగినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు నగేష్‌కు ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంకా ఇక్కడి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగంగా చెప్పకున్నా.. నగేష్‌కు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.
క్రాస్‌ఓటింగ్ భయం
ఈ స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. కొన్నిచోట్ల ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా తమ క్యాంపుల్లో భాగస్వామ్యం చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులను కూడా తమ ఓటర్లుగానే లెక్కేస్తున్నారు. కానీ వారంతా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తారా.. లేకుంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడుతారా అనేది మంత్రులను సైతం వణికిస్తోంది. మండలి ఎన్నికల్లో 90 శాతం బలం ఉండి కూడా అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోతే ప్రజా వ్యతిరేకత కిందే పరిగణించాల్సి వస్తుందంటున్నారు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ప్రభావం చూపించనుంది. దీంతో అధికార పార్టీ ఈ ఎన్నికలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ అంతే ధీటుగా ఆయా జిల్లాల్లో విపక్ష నేతలు కూడా పావులు కదుపుతున్నారు.