ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం

by Shyam |
ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్ష కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తలకు దారి తీసింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేయడమే కాకుండా, కనిపించిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియోగంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు జలదీక్ష చేయాలని కాంగ్రెస్ నిర్ణయించగా, ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదన్న పోలీసులు దీక్షకు వెళ్తున్న నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిని చింతపల్లి మండలం గొనుకొండ్ల చెక్‌పోస్టు అదుపులోకి తీసుకున్నారు. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌కు వర్తించని లాక్‌డౌన్ నిబంధనలు తమకు ఎందుకు అడ్డు వస్తున్నాయంటూ మండిపడ్డారు. మా నియోజకవర్గంలో మమ్మల్ని తిరగనీయకుంటే ఎలా అని ఫైర్ అయ్యారు.

సోమవారం రాత్రి నుంచే కొడంగల్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి ఇంటిదగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి జలదీక్షకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పథకం పూర్తి చేయాలంటూ జలదీక్ష చేసేందుకు సిద్దమైన రేవంత్‌ను పోలీసులు నిలువరించారు. నేతలు ఎవరూ లక్ష్మీదేవిపల్లికి పోకుండా రహదారులన్నీ దిగ్బంధం చేశారు. మంగళవారం ఉదయం వరకు రేవంత్ నివాసానికి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అటు పాలేరులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గృహ నిర్బంధంలో పెట్టారు. వరంగల్‌లో ఎమ్మెల్యే సీతక్కను హౌస్ అరెస్ట్ చేయగా, కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్, అలంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్, మహబూబ్‌నగర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, హైదరాబాద్‌లో వంశీచందర్‌రెడ్డి, మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్‌తో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పాలేరు జ‌లాశయం వ‌ద్దకు కార్యకర్తలతో కలిసి వెళ్తున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పోలీసులు మార్గ‌ మ‌ధ్యలోనే అరెస్టు చేశారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా రైతుల భవిష్యత్తు కోసం కృష్ణానది ప్రాజెక్టుల దగ్గర దీక్షలు చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టులు చేసినా, కొల్లాపూర్‌‌లో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం రోజున ప్రభుత్వ విధానం బయట పడిందని పేర్కొన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌తో సహ పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు ఆవిర్భావ వేడుకలకు ఎస్కార్ట్‌తో పంపించారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు రావడం లేదని, రాష్ట్రంలో 24 లక్షల మంది నిరుద్యోగులున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్క ప్రాజెక్టు దగ్గర కూడా తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారిని అరెస్టులు చేయడం అలవాటుగా మారిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed