సిద్దిపేటకు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్.. అసలు ఏం జరిగింది..?

by Shyam |   ( Updated:2021-12-13 09:25:54.0  )
army
X

దిశ, సిద్దిపేట: గత నెల 17న పంజాబ్‌లోని ఫరిద్ కోట్ నుంచి సెలవుపై వచ్చి ఆచూకీ లభించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆర్మీ జవాన్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డి పల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్‌గా ఎంపికై పంజాబ్‌లోని ఫరిద్ కోట్ రెజ్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. అయితే గత నెల 17న ఫరిద్కోట నుంచి సెలవుపై ఇంటికి వచ్చాడన్నారు.

ఈ నెల 5న తిరిగి విధుల్లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయంలో రాత్రి 9 గంటలకు విమానం ఎక్కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టర్మీనల్ 2 లో దిగాడన్నారు. అతను దిగినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి లోకల్ ట్రైన్‌లో ఫరిద్ కోట్‌కు మరో జవాన్, లోకల్ వైద్యుడు మనీష్‌తో కలిసి బయలు దేరినట్లు సీసీ పుటేజ్ ఆధారంగా తెలుస్తుందన్నారు. మరుసటి రోజు బతిండియాలో ఆ ఇద్దరు దిగి వెళ్లిపోయారనీ, ఆ తరువాత సాయికిరణ్ రెడ్డి ఆచూకీ లభించడం లేదనీ ఈ నెల 10న అతని తండ్రి పటేల్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాయికిరణ్ రెడ్డి కెప్టెన్ నిఖిల్ శర్మకు రిపోర్ట్ చేయాల్సి ఉందన్నారు.

తండ్రి ఫిర్యాదు మేరకు జీరో FIR కింద కేసు నమోదు చేశామన్నారు. సాయి కిరణ్ చివరి లోకేషన్ 6వ తేదీన హర్యానా లోని జకాన్ మండి వద్ద లోకేట్ అయినట్లు రికార్డ్ అయినట్లు గుర్తించామన్నారు. ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, ఫరిద్ కోట్ పోలీస్ స్టేషన్లకు FIR ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వివరాలు వెల్లడించారు. సాయి కిరణ్ సిద్దిపేట జిల్లా వాసి కావడంతో ప్రత్యేకంగా మూడు టీమ్ లు ఏర్పాటు చేసి.. విచారణ చేపట్టామన్నారు. ఈ విషయాలను కెప్టెన్ నిఖిల్‌కు వివరించామని, ప్రత్యేక టీమ్స్‌తో, సెల్ టవర్ లొకేషన్‌తో అతని ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు.

Advertisement

Next Story