లాక్‌డౌన్ పేరిట పోలీసులు కొట్టి చంపేశారా?

by srinivas |

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సందర్భంగా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండడంతో అక్కడ ఎలాంటి ఉల్లంఘనలను పోలీసులు అంగీకరించడం లేదు. స్ట్రిక్ట్‌గా డ్యూటీ చేస్తూ యువకుడి ప్రాణాలు తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన వివరాల్లోక వెళ్తే…

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆరో వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ (33) తండ్రి ఆదాంకు చెందిన మెడికల్ స్టిప్‌లను తీసుకుని నర్సారావు పేట రోడ్డులోని పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ మీదుగా వస్తుండగా.. ఎస్సై రమేష్ అతనిని ఆపి ఎక్కడికి వెళ్లి వస్తున్నావని ప్రశ్నించారు. తన తండ్రి ఇంటికి వెళ్లి వస్తున్నానని సమాధానం చెప్పడంతో.. అకారణంగా బయటకు వచ్చాడని భావించిన ఎస్సై లాఠీతో గౌస్ వీపుపై కొట్టారు. దీంతో ఆ దెబ్బలకు తాళలేని గౌస్ అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని గౌస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందాడు. గౌస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, 11 ఏళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారని అతని తండ్రి తెలిపారు. ఎస్సై కొట్టిన దెబ్బల కారణంగానే గౌస్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆ ప్రాంతంలో రెడ్ జోన్ అమలులో ఉన్నందున కంటైన్ మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. గౌస్‌ను పోలీసులు ఆపిన సమయంలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్‌ను చూపించలేదని చెబుతున్నారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, జరిగిన ఘటనపై శాఖా పరమైన విచారణకు ఆదేశించామని, పోలీసుల తప్పుందని భావిస్తే, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags: guntur district, sattenapalli, narsaraopeta, police attack, mohammed gouse dead, red zone, containment rule

Advertisement

Next Story

Most Viewed