- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో భారత్ దీటుగా పోరాడుతోంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో భారత్ దీటుగా పోరాడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మహమ్మారి వేగానికి కళ్లెం వేయగలిగిందని తెలిపారు. సరైన సమయంలో అప్రమత్తమవ్వడంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. కరోనాపై మనం చేస్తున్న పోరాటాన్ని భావితరాలు అధ్యయనం చేస్తాయని పేర్కొన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థకు ఉదాహరణగా ఈ ఘట్టం గుర్తుండిపోతుందని చెప్పారు.
21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు సుమారు 3.5లక్షలకు చేరువవుతున్న సందర్భంలో మోడీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 30వ తేదీతో తాజా లాక్‌డౌన్ ముగియనుండటంతో తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై సలహాలు, సూచనలను ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని కోరారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, రాష్ట్రాలు తీసుకుంటున్న కట్టడి చర్యలపై చర్చించారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రధాని ఆరోసారి ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు.
మాస్క్ వద్దన్న ఆలోచనే వద్దు
మనదేశంలో ఒక్క భారతీయుడి మరణమైనా బాధాకరమే కానీ, ప్రపంచంలో అత్యల్ప కరోనా మరణాలున్న దేశాల్లో భారత్ ఒకటి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సమావేశంలో మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రికవరీ రేటు 50శాతానికి మించి పెరుగుతోందని చెప్పారు. ‘రెండు వారాలు అమలైన అన్‌లాక్ 1 మనకు కొన్ని పాఠాలు నేర్పింది. అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తే మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖానికి మాస్క్ లేకుండా బయటికెళ్లడం సరికాదు. మాస్క్ లేకుండా బయట అడుగుపెట్టాలనే ఆలోచనే ఉండొద్దు. రెండు గజాల దూరాన్ని పాటించడం, తరుచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వినియోగం ఇప్పుడు అత్యవసరం. మార్కెట్లు తెరుచుకుంటుండటంతో ప్రజలు బయటకెళ్లున్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అన్‌లాక్ 1 అమల్లోకి వచ్చి రెండు వారాలు గడిచాయి. ఈ అనుభవం సమీప భవిష్యత్తులో పనికొస్తుంది’ అని వివరించారు. ముందుముందు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు, విలువైన సూచనలు, సలహాలను అందించాలని ముఖ్యమంత్రులను ఉద్దేశించి అన్నారు.
ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది
సీఎంలతో నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ప్రధాని మోడీ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న పరిశ్రమలకు తగిన సూచనలు ఇవ్వాల్సి ఉన్నదని, ప్రస్తుతం అటువైపుగా చర్యలు సాగుతున్నాయని చెప్పారు. ట్రేడ్, పరిశ్రమలు తిరిగి ఎప్పటిలాగే పనిచేయాలంటే అందరు కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఉండే అవకాశమున్నదన్న ఆయన పరోక్ష సంకేతాలనిచ్చారు. అన్‌లాక్ 1తో ప్రజలు బయటకొస్తున్నారని, అన్ని రంగాలు యథావిధిగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగంగా గాడిన
పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
కాగా, ఈ మహమ్మారిపై పోరాడేందుకు యావత్ దేశాన్ని ఏకతాటిమీదకు తీసుకొచ్చారని ప్రధాని మోడీకి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కరోనా కట్టడికి తమ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న వనరులు, సదుపాయాల గురించి వివరించారు.