ఫేవరేట్‌ పీఎంగా మోడీ.. సీఎంగా ననీన్ పట్నాయక్

by Shamantha N |
ఫేవరేట్‌ పీఎంగా మోడీ.. సీఎంగా ననీన్ పట్నాయక్
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదారణ అంతకంతకూ పెరుగుతోంది. కొవిడ్ 19 కట్టడి, వలస కార్మికుల బాధలు, ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, నిరుద్యోగితలాంటి వాస్తవ సమస్యలు తీవ్రమవుతున్నా ఆయనకున్న ఆదరణ చెక్కుచెదరలేదు. తాజాగా విడుదలైన సీ-వోటర్ సర్వే ఇదే విషయాన్ని వెల్లడించింది. సర్వే చేసినవారిలో 66.20 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకే తమ మద్దతును ప్రకటించారు. పీఎం పదవికి తమ ఫేవరేట్ నరేంద్ర మోడీనే అని స్పష్టం చేశారు. కాగా, 23.21 శాతం మంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సపోర్ట్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు నరేంద్ర మోడీ ప్రజలను మెప్పించడమే కాదు, తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించడంలో సఫలీకృతమయ్యారు. తొలిసారిగా ఒక కాంగ్రెస్సేతర కూటమి.. సంపూర్ణ మెజారిటీని ఆయన నేతృత్వంలోనే సాధించింది. దేశంలోని కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌కు ధీటైన సవాల్‌గా పరిణమించిన మోడీపట్ల 58.36శాతం మంది చాలా సంతృప్తిని ప్రకటించారు. 24.04శాతం మంది ఆయన పర్ఫార్మెన్స్ ఓ మేరకు బాగానే ఉన్నదని అభిప్రాయపడగా, అసంతృప్తికరంగా ఉన్నదని 16.71శాతం మంది తెలిపారు. సీ-వోటర్ ఈ ‘స్టేట్ ఆఫ్ ద నేషన్ 2020: మే’ సర్వేను ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 3,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి రూపొందించింది.

మోడీపై సంతృప్తిగా ఉన్న రాష్ట్రాలు

సీ వోటర్ సర్వే ప్రకారం.. ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రజలు పీఎం మోడీ పర్ఫార్మెన్స్‌కు జైకొట్టారు. ఒడిషాలో 95.6శాతం మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 93.95శాతం మంది, ఛత్తీస్‌గడ్‌లో 92.73శాతం మంది ప్రజలు పీఎం మోడీపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ జాబితా టాప్ టెన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలూ ఉన్నాయి. ఛత్తీస్‌గడ్ తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్(83.6శాతం), జార్ఖండ్(82.97శాతం), కర్ణాటక(82.56శాతం), గుజరాత్(76.42శాతం), అసోం(74.59శాతం), తెలంగాణ(71.51శాతం), మహారాష్ట్ర(71.48శాతం)లు ఉన్నాయి. అయితే, రెండు రాష్ట్రాలు తమిళనాడు(32.89శాతం), కేరళ(32.15శాతం) ప్రజలు మాత్రం మోడీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. కాగా, మూడు రాష్ట్రాల్లో మాత్రం మోడీ కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ ఆదరణ ఉన్నది. గోవా(52.4శాతం), కేరళ(46.87శాతం), తమిళనాడు(42.76శాతం)లలో రాహుల్ గాంధీకి మద్దతు అధికంగా ఉన్నది. కాగా, ఈ రాష్ట్రాల్లో మోడీకి వరుసగా 41.3శాతం, 36.4శాతం, 37.64శాతం మద్దతు లభించింది.

కాగా, కేంద్ర పాలనా తీరుపై హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గడ్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్(97.46శాతం), ఒడిషా(95.73శాతం), ఛత్తీస్‌గడ్(91.42శాతం), ఆంధ్రప్రదేశ్(78.65శాతం), జార్ఖండ్(76.84శాతం), గుజరాత్(75.4శాతం), అసోం(73శాతం), ఈశాన్య రాష్ట్రాలు(72.75శాతం), తెలంగాణ(68.96శాతం), కర్ణాటక(67.94శాతం)రాష్ట్రాల ప్రజలు కేంద్ర పాలనపై సంతృప్తిగానే ఉన్నారు. కాగా, గోవా(9.62శాతం), హర్యానా(28.73శాతం), కేరళ(30.73శాతం), తమిళనాడు(31.33శాతం), జమ్ము కశ్మీర్(46.14శాతం), ఉత్తరఖాండ్(47.1శాతం), ఢిల్లీ(51.75శాతం), యూపీ(52.03శాతం)ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్ పట్నాయక్

అత్యధిక జనాదారణ గల సీఎంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. రాష్ట్రాల వారీగా చేసిన సర్వేలో 82.96శాతం మంది ప్రజలు నవీన్ పట్నాయక్‌కే సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో టాప్ 5లో ఛత్తీస్‌గడ్ సీఎం భుపేష్ భగేల్(81.06శాతం), కేరళ సీఎం పినరయి విజయన్(80.28శాతం), ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి(78.01శాతం), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(76.52శాతం)ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కర్ణాటక సీఎం బీఎస్ యెడ్యూరప్పలున్నాయరు. కాగా, తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావును 54.22శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 52.06శాతం మంది మద్దతునిస్తున్నారు. తక్కువ పాపులర్ సీఎంల జాబితాలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(సర్వే చేసిన వారిలో 4.47శాతం మంది మాత్రమే ఆదరిస్తున్నారు) తొలిస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్ సీఎం టీఎస్ రావత్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం పళనిస్వామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed