మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

by Shamantha N |
మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు సమావేశం కానున్నట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 16న 21 రాష్ట్రాల (కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని), మరుసటి రోజున మరో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో సమావేశం కానున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పశ్చిమబెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్ లాంటి పదిహేను రాష్ట్రాలతో ఈ నెల 17న సమావేశం ఖరారైంది. తొలి రోజున మాత్రం పంజాబ్, అస్సాం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, చండీఘడ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్, సిక్కిం, లక్షద్వీప్, దాద్రానగర్ రాష్ట్రాలతో సమావేశం కానున్నారు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, సడలింపులపై అభిప్రాయాలు, మళ్ళీ లాక్‌డౌన్ ఆవశ్యకత ఏ మేరకు ఉంది, ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వవచ్చు, మార్పులు చేర్పులు తదితర అంశాలపై ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతోపాటు కేంద్రం నుంచి కోరుకుంటున్న సహకారం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు మధ్యాహ్నం మూడు గంటలకు సమయాన్ని ఖరారు చేసిన ప్రధాని కార్యాలయం రాత్రి ఏడు గంటల వరకు కొనసాగించే అవకాశం ఉంది.

Advertisement

Next Story