ఓరుగల్లులో జూదం… పోలీసుల ఉక్కుపాదం

by Shyam |
ఓరుగల్లులో జూదం… పోలీసుల ఉక్కుపాదం
X

దిశ, వరంగల్: కరోనాతో అందరూ ఆగమాగమవుతుంటే ఇక్కడ మాత్రం కొందరు కరోనాను క్యాచ్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా వాళ్ల పనులకు సానుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ సమయంలో ఆచి చూచి అడుగులు వేస్తున్నారు. అంతేకాదు అక్కడే అన్ని ఏర్పాట్లు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, వారి నుంచి తప్పించుకలేక పోతున్నారు. ఆశ్చర్యమేమిటంటే.. ఆ ప్రముఖుల్లో ఓ మహిళ కూడా ఉండడం విశేషం. దీంతో అలా ఇంకెంతమంది మహిళలున్నారో అనే అనుమానాలు ప్రజల మదిలో గిర్రా గిర్రా తిరుగుతున్నాయి.

కరోనా వైరస్ జూదరులకు కలిసొచ్చింది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన జూదరులు ఎంచక్కా ఆడేసుకుంటున్నారు. గ్రామాల్లో చెట్ల కింద, తోటల్లో ఆటలు నిర్వహిస్తుండగా నగరాలు, పట్టణాల్లో పలువురు వీఐపీల ఇండ్లలో జూదం ఆడుతున్నారు. ప్రతీరోజు ఏదో ఒకచోట జూదం ఆడుతూ పట్టుబడుతున్న ఘటనలు చూస్తున్నాం. లాక్ డౌన్ నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది పట్టుబడినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. నిన్న ఒక్కరోజే పదుల సంఖ్యలో కేసులు నమోదవగా వరంగల్లోని కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే తమ్ముడు జూదం ఆడుతూ పోలీసులకు దొరికాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి సుమారు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోన్నది.

ఇల్లే క్లబ్బులు…?

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ జూదం ఆడడాన్ని నిషేధించారు. దీంతో వారు పక్క రాష్ట్టాలకు వెళ్లి జూదం ఆడేవారు. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా వారికి పలు రాయితీలు ప్రకటించడంతో ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులయ్యారు. మిగిలిన వారు జిల్లా సరిహద్దుల్లోని తోటలు, పలు వెంచర్లు అడ్డాగా చేసుకుని జూదం నిర్వహించేవారు. వీరికి కొందరు పోలీస్ అధికారులు కూడా సహకరించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత తోటలపై నిఘా పెరగడంతో ఆ కేంద్రాలను జూదరులు ఇండ్లలోకి మార్చారు. ప్రధానంగా పలువురి వీఐపీల ఇండ్లలోనే జూదం ఆడేవారని తెలుస్తోన్నది. ప్రజా ప్రతినిధులు, వీఐపీల ఇండ్లలో పోలీసులు అంత సులభంగా వచ్చే అవకాశం లేనందున జూదం జోరుగా నడిచేదని సమాచారం. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పేదోడి నుంచి పెద్దోళ్ల వరకు ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితి లేనందున వారు జూదం ఆడుతూ టైంపాస్ చేస్తున్నట్లు తెలుస్తోన్నది.

ఇప్పటి వరకు 996 మంది అరెస్ట్..?

లాక్ డౌన్ కారణంగా పోలీస్ కేసులు తగ్గుముఖం పట్టగా జూదం కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 996 మంది అరెస్ట్ అవగా వారి నుంచి రూ. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక్క వరంగల్ అర్భన్ జిల్లాలోనే 306 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 5 లక్షలు సీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అంతేగాకుండా ప్రతిరోజు ఏదో ఒకచోట జూదం ఆడుతూ పెద్దసంఖ్యలో పట్టుబడుతున్నారు. కొద్దిరోజుల కిందట వర్థన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా సైతం జూదం ఆడుతూ పట్టుబడింది. పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, పత్తి, రైస్ మిల్లు యాజమానులు ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed