ఐపీఎల్‌లో కొవిడ్-19 నిబంధనలు ఇవే..

by Shiva |
ఐపీఎల్‌లో కొవిడ్-19 నిబంధనలు ఇవే..
X

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో ఇండియాలో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13వ సీజన్‌ను యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు, యాజమాన్యం భద్రత కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పలు నిబంధనలు రూపొందించింది. బయో బబుల్ వాతావరణంలో నిర్వహించనున్న ఐపీఎల్ జరిగినన్ని రోజులు ప్రతి 5రోజులకు ఒకసారి ఆటగాళ్లకు కొవిడ్ -19 ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఎవరైనా ఆటగాడు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే 7 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంది. కాగా, భారతీయ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ జట్లతో చేరక ముందే రెండు సార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ పాజిటివ్ నిర్ధారణ అయితే 14 రోజులపాటు క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ తర్వాత మరో రెండుసార్లు కొవిడ్ పరీక్ష చేసి నెగెటివ్ అని నిర్ధారణ అయితేనే యూఏఈ వెళ్లడానికి అర్హత సాధిస్తారు. విదేశీ ఆటగాళ్లు వచ్చే ముందే తమ దేశంలో పరీక్షలు చేయించుకోవాలి.

మరికొన్ని నిబంధనలు..

* యూఏఈ చేరగానే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మొత్తానికి కొవిడ్ – 19 టెస్టులు చేస్తారు
* అనంతరం వారిని 7 రోజులపాటు క్వారంటైన్‌కు తరలిస్తారు
* ఈ సమయంలో ఆటగాళ్లు, సిబ్బంది, కోచ్‌లు ఒకరిని ఒకరు కలుసుకోవడానికి అనుమతించరు.
* ప్రతి రోజు ర్యాపిడ్ టెస్టులు చేస్తారు. నెగెటివ్ వస్తేనే బయోబబుల్‌లోకి అనుమతిస్తారు.
* బయోబబుల్‌లోకి అనుమతించిన ఆటగాళ్లు మాత్రమే శిక్షణ శిబిరాల్లో పాల్గొనవలసి ఉంటుంది.
* క్రికెటర్ల కుటుంబాలను అనుమతించే విషయం ఆయా ఫ్రాంచైజీల నిర్ణయానికే బీసీసీఐ వదిలేసింది.
* క్రికెటర్ల కుటుంబాలను బయోబబుల్‌లోనికి అనుమతించరు. కానీ భౌతిక దూరం పాటిస్తూ వారితో మాట్లాడుకోవడానికి, కలుసుకోవడానికి అనుమతులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed