- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ప్లాస్మా ఫర్ సేల్?
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా రాకుండా కోట్లాది మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దిమంది మాత్రం కరోనా వచ్చినందుకు సంతోషపడుతున్నారు. తమలో తయారైన యాంటీ బాడీస్‌ని ప్లాస్మా రూపంలో అమ్ముకుంటే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని భావించడమే ఇందుకు కారణం. ఒక్క ప్లాస్మా డొనేషన్‌కు మూడు లక్షల రూపాయల ధర పలుకుతోంది. కరోనాతో చావుబతుకుల్లో ఉన్నవారికి ప్లాస్మా దానం ద్వారా ప్రాణం పోయాల్సిన పవిత్ర కార్యం ఇప్పుడు కాసుల కోసం కక్కుర్తి పడుతోంది. ఇందుకోసం దళారులూ పుట్టుకొచ్చారు. ప్లాస్మా దాతలను తీసుకొస్తామని అడ్వాన్సు తీసుకుని మోసానికి పాల్పడుతున్న సంఘటనలూ ఉన్నాయి.
ఓ బాధితుడు ట్విట్టర్ ద్వారా మంత్రులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా నుంచి కోలుకున్నా ప్రభుత్వాలు మాత్రం ప్లాస్మా దానం దిశగా వారిని ప్రోత్సహించడంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ కేంద్రంలో ఒక ప్లాస్మా బ్యాంకును నెలకొల్పింది. ఇక్కడ పదుల సంఖ్యలో మాత్రమే ప్లాస్మా దానం జరిగింది. తెలంగాణలో సుమారు 20 వేల మంది వైరస్ బారిన పడి కోలుకుంటే ప్లాస్మా దానం చేసినవారి సంఖ్య 25 కూడా దాటలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 16 కోట్ల రూపాయలతో ఈ మెకానిజంకు శ్రీకారం చుట్టింది.
అమ్మకానికి ప్లాస్మా
ప్లాస్మా కోసం ఎదురుచూసే పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు. పైసా ఆశించకుండా దానం చేసేవారు చాలా మందే ఉన్నారు. పేషెంట్లు తృప్తితో ఎంతో కొంత ఇస్తే తీసుకునేవారూ ఉన్నారు. లక్షల రూపాయలు డిమాండ్ చేసి అమ్ముకునేవారూ ఉన్నారు. పేషెంట్ల బంధువులు ప్లాస్మా కోసం ఐదారు వేల రూపాయలు డిజిటల్ రూపంలో దళారులకు బదిలీ చేసి మోసపోయినవారూ ఉన్నారు. ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తెలంగాణ పోలీసులకు తెలియజేసినా చర్యలు లేవు. కరోనా చికిత్స అనంతరం కోలుకుంటున్నవారు వేల సంఖ్యలోనే ఉన్నారు. వారంతా ప్లాస్మా దానానికి ముందుకు రాగలిగితే సమస్య ఉత్పన్నం కాదు. డిమాండ్‌కు తగినంతగా సప్లయ్ లేకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి తన విభాగంలో పనిచేసే ఒక అధికారి కోసం ‘ప్లాస్మా డొనేషన్ కావలెను’ అని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. రెండురోజుల క్రితం హైదరాబాద్ పోలీసు శాఖ సైతం ‘ప్లాస్మా దాతలు కావలెను’ అని విన్నవించింది. ప్లాస్మాను దానం చేయాలనే అవగాహన చాలా మందిలో లేకపోవడంతో డిమాండ్‌కు తగినంతగా దొరకడం లేదు. గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ప్లాస్మా థెరఫీ ఉన్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. కానీ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ చికిత్స జరుగుతోంది.
స్ఫూర్తి నింపుతున్న ఓరుగల్లు బిడ్డ
కరోనా బారిన పడి కోలుకున్న వరంగల్‌కు చెందిన యువ న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ ఇప్పటికి రెండుసార్లు ఉచితంగా ప్లాస్మా దానం చేశారు. రాష్ట్రంలో తొలి ప్లాస్మా దాత కూడా ఇతనే. తన సొంత ఖర్చుతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ప్లాస్మా ఇచ్చి నలుగురైదుగురి ప్రాణాలను కాపాడారు. ఆ స్ఫూర్తితో మరికొద్దిమంది యువకులకు అవగాహన కల్పించి ఒక టీమ్‌నే తయారు చేశారు. ఇప్పటికి సుమారు 300 మంది ప్లాస్మాను దానం చేసినట్లు ఆయన ‘దిశ’కు వివరించారు. ‘‘నేరుగా ప్రభుత్వమే ఈ ప్రయత్నానికి పూనుకుంటే వేల మందికి ప్లాస్మాను సమకూర్చడం అసాధ్యమేమీ కాదు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని నోడల్ ఏజెన్సీగా పెట్టి దీనికి శ్రీకారం చుట్టవచ్చు. కనీసం నా లాంటివారు నిస్వార్థంగా ఈ ప్రయత్నానికి పూనుకుందామనుకుంటే రికవరీ అయిన పేషెంట్ల వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. మంత్రికి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు” అని అఖిల్ వ్యాఖ్యానించారు.