లోటస్ పాండ్‌లో ‘పీకే’ మకాం.. రహస్యంగా చర్చలు?

by Anukaran |   ( Updated:2021-07-07 00:46:47.0  )
Sharmila PK
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల నూతన పార్టీని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి జూలై 8వ తేదీన అధికారికంగా పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనుంది. అయితే తన పార్టీకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను నియమించనున్నట్లు వార్తలొచ్చాయి. కాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసేది లేదని ప్రకటించారు. తాజాగా సోమవారం లోటస్ పాండ్ లో జగన్ కు చెందిన బిల్డింగ్ లో పీకే దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్‌కు గత ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ‘పీకే’ టీమ్ కు కార్యాలయాన్ని కేటాయించారు జగన్. అప్పటి నుంచి ఆ భవనంలోనే ‘పీకే’ కార్యాలయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో తన టీమ్‌తో ప్రశాంత్ కిశోర్ రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. అయితే ఆ చర్చలు షర్మిల రాజకీయ భవిష్యత్ పైనే జరిగాయా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా ఆయన వచ్చిన విషయాన్ని కూడా అత్యంత రహస్యంగా ఉంచడం హాట్ టాపిక్ గా మారింది.

లోటస్ పాండ్‌లో ‘పీకే’ ఆఫీస్

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరుపున వ్యూహకర్తగా ఆయన పనిచేసి సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్ మధ్య స్నేహ బంధం పెరిగింది. గతంలో జగన్‌తో కలిసి పనిచేసిన సందర్భంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ కోసం కార్యాలయాన్ని కేటాయించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పీకే తన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ.పీ.ఏ.సీ) కార్యాలయాన్ని లోటస్ పాండ్ లోనే కొనసాగిస్తున్నారు. జగన్ ను గెలిపించేందుకు వ్యూహాలన్నీ లోటస్ పాండ్ నుంచే పీకే రచించారు.

కాగా ఇటీవల విజయమ్మ సైతం పలువురు నేతలతో షర్మిల పార్టీకి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వస్తున్నట్లు తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆయన వ్యూహకర్తగా పనిచేసేది లేదని, తన టీమ్ మాత్రం కొనసాగిస్తుందని ‘పీకే’ ప్రకటించారు. తాజాగా లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన తన టీం సభ్యులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా షర్మిల పార్టీ ఆవిర్భావానికి రెండు రోజుల ముందు ప్రశాంత్ కిశోర్ రావడం వెనుక ఆంతర్యమేదో ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే గతంలో జగన్ కోసం పనిచేసిన ఆయన ఇప్పుడు చెల్లి కోసం తిరిగి లోటస్ పాండ్ కు వచ్చారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కు వ్యూహరచన చేసినట్లుగానే ఇప్పుడు షర్మిల భవిష్యత్ రాజకీయాలపై కూడా ఇక్కడి నుంచే ప్రణాళికలు జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వచ్చింది షర్మిల రాజకీయ భవిష్యత్ కోసమేనా?

ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియ ఇటీవల షర్మిలను లోటస్ పాండ్ లో కలిశారు. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ‘పీకే’ వ్యూహకర్తగా పనిచేసేది లేదని ప్రకటించిన నేపథ్యంలో తనకు బదులుగా తన శిష్యురాలు ప్రియను పంపించినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరిగాయి. షర్మిలను ప్రియ కలిసిన కొద్ది రోజుల అనంతరం ప్రశాంత్ కిశోర్ లోటస్ పాండ్ కు చేరుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా షర్మిల లేని సమయంలో ‘ప్రశాంత్ కిశోర్’ తన ‘ఐపీఏసీ’ కార్యాలయానికి రావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత రహస్యంగా జరిగిన సమావేశంలో షర్మిల రాజకీయ భవిష్యత్ పైనే చర్చలు జరిగాయా? లేదా మరే ఇతర అంశపైన జరిగిందా అనేది అంతుచిక్కడంలేదు. అయితే షర్మిలను సీఎం చేయాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఎలాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే అంశాలపైనే చర్చ సాగినట్లు రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed