పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం.. ఏంటో తెలుసా?

by D.Reddy |
పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం.. ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామంది తరచూ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకులకు వెళ్తుంటాం. అయితే, పెట్రోల్ బంకుల్లో కేవలం పెట్రోల్‌, డీజిల్‌ మాత్రమే కాదు.. వినియోగదారులకు చాలా సేవలు బంకు యాజమాన్యాలు కల్పించాలి. కానీ, చాలా మందికి వాటి గురించి అవగాహన లేకపోవటంతో యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించినా, లేకపోయినా ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. అంతేకాదు, ఈ సౌకర్యాలు కల్పించకుంటే పెట్రోలియం సంస్థలకు నేరుగా ఫిర్యాదు కూడా చేయొచ్చు. మరీ ఆ సౌకర్యాలేంటో? ఎలా ఫిర్యాదు చేయొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రథమ చికిత్స కిట్‌: ప్రతి పెట్రోల్ బంకుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండాలి. కిట్‌లోని వైద్య పరికరాలను, ఔషధాలను ఎప్పటికప్పుడు మార్చుస్తుంటారు. అనుకోని ప్రమాదం జరిగిన సందర్భాల్లో దీనిని ఎవరైనా వాడుకోవచ్చు.

తాగునీరు: దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా ప్రాంతాల్లో నీటి సౌకర్యం లభించదు. ఇక వేసవి కాలంలో అయితే చెప్పనవసరం లేదు. బంకుల్లో తప్పనిసరిగా నాణ్యమైన ఆర్వో యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఉచితంగా తాగు నీటి సదుపాయాన్ని పొందొచ్చు.

వాష్ రూమ్స్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బంకుల్లో శుభ్రమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలి. వాటిని ఉచితంగా ఎవరైనా వినియోగించుకోవచ్చు.

ఫోన్‌ సౌకర్యం: అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేసుకునేందుకు పెట్రోల్‌ బంకుల్లో ఫోన్ సదుపాయం ఉంటుంది.

వాహనాలకు ఉచిత గాలి: వినియోగదారుల వాహనాల టైర్లలో గాలి నింపడానికి, తనిఖీ చేసుకోవడానికి తప్పనిసరిగా సంబంధిత మిషన్ ఉండాలి. ఓ వ్యక్తి కూడా అక్కడ అందుబాటులో ఉండాలి. ఇది పూర్తిగా ఉచితం. సర్వీస్‌ నచ్చితే టిప్‌ కూడా ఇవ్వొచ్చు. అది కస్టమర్ ఇష్టం.

ఫిర్యాదుల బాక్స్: పెట్రోల్‌ బంకుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం ఫిర్యాదు బాక్స్ అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు ఫిర్యాదు, సలహాలు, సూచనలు రాసి ఆ పెట్టెలో వేయొచ్చు.

నాణ్యత ప్రమాణాల తనిఖీ: బంకులోని పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతపై అనుమానం కలిగితే అక్కడే చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పరికరాలు, ఫిల్టర్‌ కాగితాలు కూడా బంకు సిబ్బందే ఇవ్వాలి. దీనితో పాటు పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ పరిమాణంలో వస్తుందనిపించినా పరీక్షించుకోవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి:

బంకుల్లో నిబంధనల ప్రకారం ఈ సదుపాయాల్లో ఏ ఒక్కటి లేకపోయినా, బంకు సిబ్బంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. చిరునామా, ఇతర సమాచారం ఇస్తే సంబంధిత చమురు సంస్థ వారిపై వెంటనే చర్యలు తీసుకుంటుంది.

* ఇండియన్ ఆయిల్: 1800 233 355

* భారత్ పెట్రోలియం: 1800 224 344

* హెచ్‌పీసీఎల్: 1800 2333 555

* రిలయన్స్: 1800 8919 023

Next Story