మృత్యు కుహరాలుగా మారిన గోతులు.. చర్యలు తీసుకోరా..?

by Sridhar Babu |
మృత్యు కుహరాలుగా మారిన గోతులు.. చర్యలు తీసుకోరా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నీటి ప్రవాహపు లోపల ఉన్న గోతులు మృత్యు కుహరాలుగా తయారయ్యాయి. చిన్నారుల జీవితాలపై మరణ శాసనాన్ని రాస్తున్నాయి. అడుగు తీసి అడుగేసే లోపలో మడుగులుగా మారిన గోతులు వారి ప్రాణాలను హరించేస్తున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం నలుగురు చిన్నారులను బలి తీసుకోగా, తాజాగా సిరిసిల్ల సమీపంలోని మానేరు వాగు ఆరుగురి ప్రాణాలను దిగమింగింది.

నాడు ఎల్‌ఎండీ…

2016లో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం శిఖంలో క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారుల్లో నలుగురు నీటి గోతిలో పడి చనిపోయారు. ఎర్రమట్టి కోసం జరిపిన తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో చిన్నారులు చిక్కుకపోయి మృత్యు ఒడిలోకి చేరిపోయారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది. వాస్తవంగా డ్యాంలో అక్రమ తవ్వకాలు జరపవద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో భారీ సైజు గోతులు ఏర్పడి నలుగురు చిన్నారులను బలితీసుకున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇష్టారీతిన తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన తరువాత అక్రమంగా జరుపుతున్న తవ్వకాలను కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నేడు మానేరు నది..

గల గల పారుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భూములను సస్యశామలం చేయాల్సిన మానేరు నదిలో మృత్యు ఘోష ఏకంగా ఆరు కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఆడుతూ పాడుతూ ఇంటి నుండి వెళ్లిన చిన్నారులు విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబాల రోదన మిన్నంటిపోయింది. ఇప్పటి వరకు లభ్యమైన ఐదు మృతదేహాలు కూడా మానేరు నదిలో ఏర్పడిన గోతుల్లోనే చిక్కుకుపోయాయి. ఇటీవల నిర్మించిన చెక్ డ్యాం గత నెలలో కురిసిన భారీ వర్షం, వరదలకు కొట్టుకుపోవడంతో ఏర్పడిన గోతి అని చెప్తున్నారు.

కానీ, ఇదే ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలించేందుకు కూడా పెద్ద పెద్ద గుంతలుగా తవ్వారు. కేవలం చెక్ డ్యాం వల్ల ఏర్పడ్డ గోతే కాకుండా ఇసుక కోసం జరిపిన తవ్వకాల గోతుల్లోనూ చిన్నారులు చిక్కకుపోయారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమార్కులు తమ ఆదాయం కోసం జరిపిన తవ్వకాలు వారి పాలిట మృత్యు కుహరాలుగా మారిపోయాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మానేరు నదిలో ఈత కోసం వెళ్లి మరణించారని చెబుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఏర్పడ్డ ఈ గోతులే వారి పాలిట మరణ శాసనాలుగా మారాయన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed