పాలమూరు ప్రఖ్యాతిగా పిల్లలమర్రి..!

by Shyam |
పాలమూరు ప్రఖ్యాతిగా పిల్లలమర్రి..!
X

మహబూబ్‎నగర్ జిల్లా టూరిజం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ‘పిల్లలమర్రి’. ఏపుగా పెరిగిన మర్రిచెట్టు గురించి చెబుతారు. వందలకొద్ది చెట్లున్నా.. మొదటి చెట్టు ఎక్కడో చెప్పడం కష్టం. ఇది పాలమూరు పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూరం నుంచి చెట్టు ఆకులతో ఒక చిన్నకొండ రూపాన్ని తలపిస్తోంది.

సుమారు 800 ఏళ్ళ కాలం నాటి ఈ మహావృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. పిల్లలమర్రిలో మర్రిచెట్టు, దాని శాఖలు మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇక్కడ పార్కు, జంతు ప్రదర్శన శాల, మత్స్యశాఖ, పురావస్తు మ్యూజియం, జింకల పార్క్‌, అప్పుడప్పుడూ నీరు వస్తే ఉండే బోటింగ్‌ ఉంటుంది. మ్యూజియంలో మన పూర్వీకుల కాలంలో చలామణి అయ్యే నాణెలు, పురాతన వస్తువులూ, దేవతామూర్తుల రాతి విగ్రహాలు, మారణాయుధాలూ గత చరిత్రను చాటిచెబుతాయి. ఈ మహావృక్షాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి యాత్రికులు తరలివస్తుంటారు.

చారిత్రాత్మక పిల్లలమర్రి గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. కాకతీయుల కాలం నాటి నాణెములు ఇక్కడ లభించాయి. వీరి తర్వాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా పేరొందింది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం పిల్లలమర్రి.

చరిత్రను గుర్తు చేసే మ్యూజియం..!

ప్రఖ్యాతి గాంచిన ఈ మ్యూజియాన్ని 1976 సెప్టెంబరు18న నాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన భవనంలోనే ఇప్పటి వరకు అంటే గత 44 ఏళ్లుగా అదే భవనంలో మ్యూజియాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజియంలో శిల్ప సంపద కనువిందు చేస్తోంది. క్రీస్తు పూర్వం 600-1900 ఏళ్ళ నాటి రాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, కత్తులు, కటారులు, పాత రాతి యుగపు గొడ్డళ్ళు, నూరుడు రాళ్ళు, సూక్ష్మజాతి యుగపు పని మట్లు, 19వ శతాబ్దం నాటి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, విష్ణు బూదేవి, శ్రీదేవి విగ్రహాలు, తూర్పు చాళుక్యుల నాటి నాణాలు, నల్లరాతి బసవన్నలు, శివలింగాలు, ఆకర్షణీయంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా, 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠింపచేశారు.

జింకల పార్కు, మినీ జూ..!

పిల్లలమర్రిలో జింకల పార్కు ఉంది. విహార యాత్రకు వచ్చే వారి కోసం మినీ జూ పార్కు కూడా ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు కాకుండా చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటోంది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. మ్యూజియానికి కొత్త భవన నిర్మాణం, పాలమూరు పెద్ద చెరువుతోపాటు పిల్లలమర్రిని కూడా అభివృద్ధి చేయాలని పర్యాటకులను కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed