ఠాగూర్ సీన్ రిపీట్.. ఎల్బీనగర్ ఓజోన్ ఆసుపత్రిలో దారుణం

by Sumithra |
Woman died, lb nagar Ozone Hospital
X

దిశ, ఎల్బీనగర్: వైద్యం వికటించి మహిళ మృతి చెందిన దారుణ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), భర్త ఈదుల కృష్ణయ్య భార్య భర్తలు. రెండు నెలల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా అంజనమ్మ కాలికి దెబ్బ తగిలింది. కొన్ని రోజులకు కాల్ ఇన్ఫెక్షన్ కాగా, ఎల్బీనగర్ గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓజోన్ ఆసుపత్రిలో చేర్పించారు. గత 47 రోజులుగా ఆమె ఓజోన్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇందుకుగాను రూ.13 లక్షలు ఆసుపత్రికి బిల్లు చెల్లించారు. శుక్రవారం అంజనమ్మను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి అంజనమ్మ మృతిచెందారు. అయినా, మరో రూ.2 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి

ఓజోన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి అంజనమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ప్రైవేట్ ఆసుపత్రి బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఘటనా స్థలికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు. అయినా, ఆసుపత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబాన్ని మరో రూ.2 లక్షల బిల్లు చెల్లించాలని వేధించడం సిగ్గుచేటన్నారు. అంజనమ్మ కుటుంబం చెల్లించిన రూ.13 లక్షల గాను రెట్టింపు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, అంజనమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Next Story