సీఎం జగన్‌కు ఆదేశాలు ఇవ్వండి.. సుప్రీంలో పిటిషన్ !

by Anukaran |   ( Updated:2020-10-12 12:29:14.0  )
సీఎం జగన్‌కు ఆదేశాలు ఇవ్వండి.. సుప్రీంలో పిటిషన్ !
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సలహాదారు ద్వారా బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఢిల్లీకి చెందిన న్యాయవాది సునీల్కుమార్సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 121, 211 అధికరణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సలహాదారు లేఖలోని వివరాలను బహిర్గతం చేశారని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టులోని జడ్జీల ప్రవర్తనకు సంబంధించి పార్లమెంటు లేదా శాసనసభల్లో చర్చ జరగరాదని రాజ్యాంగమే పేర్కొన్నదని పిటిషనర్ గుర్తుచేశారు.

ఒక న్యాయమూర్తిపైన లేవనెత్తిన ఆరోపణలు రోడ్లమీదకు వచ్చాయని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగం ఆయనకు ఇచ్చిన పరిమితులను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని రాజ్యాంగం సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రమాణం చేశారని, ప్రజాస్వామ్యంలోని మూడు విభిన్న వ్యవస్థలు ఒకదానిపై మరొకటి గౌరవప్రదమైన భావనతో పనిచేయాలనే స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా, న్యాయవ్యవస్థను కించపరిచే ఘటనలు పునరావృతం కాకుండా ఏపీ ముఖ్యమంత్రికి తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ముఖ్యమంత్రిగా అతను మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ న్యాయవ్యవస్థను లేదా అందులోని న్యాయమూర్తులను కించపరిచేలా వ్యవహరించరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం జగన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని న్యాయవాది సునీల్కుమార్ సింగ్ ఆ పిటిషన్‌లో కోరారు.

Advertisement

Next Story