‘మరొకరితో సహజీవనం చేస్తున్నా.. భర్త నుంచి రక్షణ కల్పించండి‘

by Sumithra |   ( Updated:2021-06-18 05:57:29.0  )
wife petition in High Court
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ భార్య వింత కేసుతో కోర్టు మెట్లెక్కింది. తన భర్త నుంచి దూరంగా ఉంటూ.. మరొకరితో సహజీవనం చేస్తున్న తనకు భర్త, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆమె పిటిషన్‌తో షాక్ తిన్న కోర్టు.. జరిమానా విధించడంతోపాటు మందలించి పంపించింది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అలహాబాద్ హైకోర్టులో ఓ వివాహిత తనకు, తన ప్రియుడికి రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. ‘‘పెళ్లి అయిన నాటి నుంచి నా భర్త నన్ను వేధించడంతోపాటు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నా భర్తతో ఉండి సంసారం చేయలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులు చూసుకునే మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నా. మేము ఇద్దరం మేజర్లం.. మా ఇష్ట ప్రకారమే సహజీవనం చేస్తున్నాం. మా సహజీవనానికి నా భర్త, బంధువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రక్షణ కల్పించండి’’ అని కోర్టును కోరింది.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కౌశల్ జయేంద్ర థాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్త ఇబ్బందులు పెట్టారన్న దానికి ఆధారాలు ఏమున్నాయని వివాహితను ప్రశ్నించింది. కనీసం మీరు ఏదైనా పోలీస్ స్టేషన్‌లో కూడా మీ భర్తపై ఫిర్యాదు చేసినట్టు ఆధారాలు లేవనీ, మీరు చేసే ఆరోపణలను నిజమని తాము నమ్మలేమని వ్యాఖ్యానించింది. భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది.

‘‘మేము మేజర్లం.. మాకు కలిసి ఉండే హక్కు ఉంది. అందుకే కలిసి ఉంటున్నాం’’ అని పిటిషనర్ వాదించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. దేశంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం హక్కులు కల్పించిందని కానీ, వాటిని చట్టం పరిధిలోనే ఉపయోగించుకోవాలని గుర్తు చేసింది. చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే అవి హక్కులు ఎలా అవుతాయని ప్రశ్నించింది. వీటిని అంగీకరించమని, పిటిషన్ ను కొట్టివేసింది. మహిళకు రూ.5 వేల జరిమానా విధించింది. భర్త నుంచి ఇబ్బందులు ఉంటే చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. మరోసారి ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది.

Advertisement

Next Story