రియల్టర్ మల్లారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by Sumithra |
రియల్టర్ మల్లారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ, క్రైమ్ బ్యూరో : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్ కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ కాగానే అమ్మకందారుడితో స్థల యాజమానికి సంబంధాలు ఉండవు. కానీ, మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కాచవాణి సింగారం, కొర్రుముల గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్లు వేసిన ఓ రియల్ వ్యాపారి, తనకు ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు అండగా ఉన్నారంటూ అమాయక ప్లాట్ ఓనర్ల నుంచి ఏడాదికి కోట్ల రూపాయలకు వసూళ్లకు తెగబడుతున్నారు ఆ వ్యాపారి. దీంతో అతని వేధింపులు భరించలేని ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

నగరంలోని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాణి సింగారం, కొర్రుముల గ్రామంలో నల్ల మల్లారెడ్డి వేసిన వెంచర్‌లో 1200 మంది సింగరేణి ఉద్యోగులతో పాటు ఇతర వ్యక్తులు మొత్తం 4,500 ప్లాట్లను కొనుగోలు చేశారు. వీరందరికీ కొనుగోలు చేసిన ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ అయ్యాయి కూడా. ఈ ప్రాంతానికి దివ్య నగర్ అని పేరు పెట్టుకున్నారు. వీటిలో దాదాపు 100 మందికి పైగా నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, వెంచర్ యాజమాని నల్ల మల్లారెడ్డి ఈ ప్రాంతంలో హర్ష హోమ్స్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఈ ప్రాంతాన్ని డెవలప్‌మెంట్ చేస్తున్నట్టుగా వేలాధి మంది అమాయక ప్లాట్ ఓనర్ల నుంచి అక్రమంగా, బలవంతంగా వసూళ్లు చేస్తున్నట్టు దివ్య నగర్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు గుజ్జ మల్లేశం శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

వెంచర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసి తన ఆధీనంలోకి తీసుకున్నాడని, ప్లాట్ ఓనర్లు యాజమానులు తమ ప్లాట్ల వద్దకు వెళ్లే క్రమంలో గుండాలతో అడ్డుకుంటూ.. దాడులు చేస్తున్నట్టు మానవ హక్కుల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ప్లాట్లు కొనుగోలు చేసిన యాజమానుల (ఒక్కొక్కరి) నుంచి ఏడాదికి లక్షలాధి రూపాయలు అక్రమంగా, బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల నుంచి రూ.10 లక్షలు, ఇతరుల నుంచి రూ.18 లక్షలు ఏడాదికి వసూలు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా, ఎస్సీ, ఎస్టీలకు చెందిన పలువురిని అక్కడ ఉద్యోగులుగా నియామకం చేసుకుని, వారితో తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించారు. ఈ ప్రకారం 1999 నుంచి ఇప్పటి వరకూ సింగరేణి ఉద్యోగుల నుంచి రూ.10.60 కోట్లు, ఇతర ప్లాట్ ఓనర్ల నుంచి రూ.50 కోట్లు మొత్తం రూ.60 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన వెనుక మంత్రులు చామకూర మల్లారెడ్డి, ఈటల రాజేదర్‌లు ఉన్నారని, ఈ డబ్బులో వారికి కూడా వాటా ఉందని, అందుకే మమ్ములను ఏవరేం చేయలేరని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిపారు.

ఈ విషయంపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు కేసులు నమోదు చేయకుండా.. రియల్ వ్యాపారి నల్ల మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులకే వత్తాసు పలుకుతున్నట్టు తెలిపారు. దీంతో తమను భయబ్రాంతులకు గురి చేస్తున్న నల్ల మల్లారెడ్డి అతని కుటుంబ సభ్యులు నిశాంత్ రెడ్డి, దివ్య రెడ్డి, స్నేహరెడ్డి, సంపత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మజా, గోపాల్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాచకొండ పోలీస్ కమిషనర్, డీజీపీ‌లు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలకు ఆదేశించాలని గుజ్జ మల్లేశం ఫిర్యాదులో వేడుకున్నారు.

Advertisement

Next Story