ఒమిక్రాన్ దడ.. టోలీచౌకీలో టెన్షన్.. టెన్షన్

by Shyam |   ( Updated:2021-12-17 11:41:51.0  )
Omicron
X

దిశ, సిటీ బ్యూరో: కరోనా సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం సిటీలో రోజురోజుకి పెరుగుతోంది. జన సంచారమెక్కువగా ఉన్న టోలీచౌకీ పరిసర ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన పారామౌంట్ హిల్స్ కాలనీ స్థానికుల వైఖరి కూడా సంచలనంగా మారింది. ఇప్పటికే కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన ఈ కాలనీకి ఉన్న నాలుగు గేట్లలో గేటు నెంబర్లు 1,2,3లను మూసివేశారు. ఇక గేటు నెంబర్ 4లోని అపార్ట్ మెంట్ వాసులు కూడా అధికార యంత్రాంగానికి ఏ మాత్రం సహకరించకపోవటం, పైగా వారు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, టెస్టులు, శానిటైజేషన్, వ్యాక్సినేషన్ వంటి చర్యలు చేపడితే, వాటిని నిరాకరించటంతో పాటు సిబ్బందిని దూషిస్తున్నారు. గడిచిన నాలుగురోజుల క్రితమే ఇక్కడ మొదటి సారిగా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య, జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన టెస్టులు, వ్యాక్సినేషన్, శానిటైజేషన్ చర్యలకు స్థానికులు ఏ మాత్రం సహకరించకపోవటం చర్చనీయాంశంగా మారింది.

టెస్టులకు వచ్చిన హెల్త్ కేర్ సిబ్బందిని దూషించటం, పై అంతస్తుల నుంచి వారిపై ఉమ్మేయటం వంటి చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసు పహారాలో టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియలు చేపట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపేమో వైద్యారోగ్య సిబ్బందికి రోజువారీ టెస్టులు, వ్యాక్సినేషన్ల టార్గెట్లు విధించటం, వాటికి స్థానికులు సహకరించకపోవటంతో వారికి తిప్పలు తప్పటం లేదు. ఇప్పటివరకు ఈ కాలనీలోని నాలుగు గేట్లలోని పలు అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లలో నివాసముంటున్న వెయ్యి మంది నుంచి అధికారులు శ్యాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. వీరిలో వెయ్యి మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇక మూడు రోజుల ముందు సేకరించిన శ్యాంపిల్స్ ను ఒమిక్రాన్ టెస్టులకు పంపించగా, వచ్చిన రిపోర్టుల్లో కొన్నింటికి సంబంధించి పాజిటివ్ వచ్చినా, ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశముండటంతో బయటకు ప్రకటించటం లేదని తెలిసింది. ఇక్కడ స్థానికుల్లో చాలా మంది రిపోర్టులు శనివారం వచ్చే అవకాశముంది.

టోలీచౌకీ పేరింటేనే టెన్షన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ కేసులు నగరంలో మొట్టమొదటి సారిగా వెలుగుచూసిన టోలీచౌకీ పారామౌంట్ కాలనీలోనే కాదు. ఆ రెండు ప్రాంతాల పేరింటేనే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న మెహిదీపట్నం, మహ్మదీయ లైన్స్, సాలార్ జంగ్ కాలనీ, కాకతీయనగర్ కాలనీ, నానల్ నగర్, సీటీఎస్ తదితర ప్రాంతాల ప్రజల టౌలీచౌకీ, పారామౌంట్ ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అటు వైపు నుంచి ఎవరైనా వచ్చినా మీరు పారామౌంట్ కాలనీ మీదుగా రాలేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story