తిరగబడ్డ జనం.. చెమటలు కక్కిన మంత్రి మల్లారెడ్డి

by Shyam |
minister-malla-reddy
X

దిశప్రతినిధి, మేడ్చల్ : అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సంక్షేమ పథకాల ముసుగులో జరుగుతున్న ఘోరాలను తెలంగాణ ప్రజానీకం పసిగట్టడమే కాకుండా పర్యటనలకు వచ్చిన వారిని నిగ్గదీసి అడుగుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నారు. మొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఇదే పరిస్థితి ఎదురవ్వగా, తాజాగా మంత్రి మల్లారెడ్డికి ప్రజలు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఫించన్లు, రైతు భీమా, దళితులకు మూడెకరాలు, వైకుంఠదామం తదితర హామీలను ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఇచ్చిన పాత సమస్యలే ఇప్పటివరకు పరిష్కరించలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
శనివారం మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి మండలంలోని కొల్తూరు గ్రామసభలో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్న జనం, ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని నిలదీసారు.

గ్రామస్థులు ఒక్కసారిగా విరుచుపడడంతో మంత్రి వారిపై అసహనం వ్యక్తంచేశారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే.. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, కొందరికి అవి చేరకపోవచ్చని, వారందరికీ చేరేలా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ముందుగా మంత్రి మల్లారెడ్డి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ శిల్పాయాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శాంసన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జహంగీర్, మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ హారిక మురళి గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ప్రజలు, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నిరసన..

ఇండ్లు లేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మూడు చింతల పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు నంద్యాల శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి రవీంద్ గౌడ్‌ల నేతృత్వంలో కొల్తూర్ గ్రామ సభ వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలను హామీల పేరిట మరోసారి మోసం చేసేందుకే రాష్ట్ర సర్కారు గ్రామసభలను నిర్వహిస్తుందని మండిపడ్డారు. జిల్లా మంత్రి మల్లారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ నాయకులు గ్రామ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఎస్సై గణేష్ రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని శామీర్ పేటకు తరలించారు. ఆందోళనలో బీజేపీ నాయకులు నరేందర్ గౌడ్, నాగరాజు, సాయిగౌడ్, వీరేశ్ నాయక్, క్రిష్ణ, హరి, జగన్ మోహన్, జహీంగీర్, రాజు, సాయి, శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed