భయం.. భయంగానే..!

by Anukaran |   ( Updated:2020-10-18 20:22:07.0  )
భయం.. భయంగానే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఇండ్లలోకి వాన నీరు చేరింది.. వీధుల్లో వరద ప్రవాహం అధికంగా ఉంది.. బయటకు వెళ్లి రాలేని పరిస్థితి.. ఇండ్లలో ఉండలేని దుస్థితి.. ఇండ్లలోకి, సెల్లార్లలోకి పాములు, పురుగులు, వ్యర్థాలు వస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నం..’ అని షిరిడీనగర్, ఎన్ఎండీసీ నగర్, రాజానగర్ వాసులు చెబుతున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని ఈ మూడు కాలనీలతో పాటు సత్తిరెడ్డినగర్, దుర్గానగర్‌ కూడా వరద ముంపునకు గురయ్యాయి. వందలాది ప్రజలు వరదల్లో చిక్కుకున్న ఇండ్లలోనే ఉంటున్నారు.

వారిని కదిలిస్తే కన్నీరే. అడిగితే పాలకులపై ఆగ్రహం. నాలుగు రోజులు గడిచిపోతున్నా పాలకులుగానీ, అధికారులు గానీ తమ గోడు పట్టించుకునే వారేరి అంటూ ప్రశ్నిస్తున్నారు. మురుగు నీళ్లలో పిల్లాపాపలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒత్తిడికి లోనవుతున్నామని షిరిడీనగర్ కు చెందిన నారాయణ వాపోయారు. ముంపు తగ్గిన ప్రాంతాలకు కంటితుడుపు చర్యగా పాలకులు, అధికారులు వస్తున్నారు. భరోసాలు, హామీలు ఇస్తున్నారు. ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారు. కానీ.. తమకు కావాల్సిన సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నాలు కూడా జరగడం లేదని ఆ కాలనీల వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. నాలుగు రోజులు దాటినా నేటికీ వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నదని, షిరిడీనగర్ స్ట్రీట్ నెంబర్ 6, 7, 8 ప్రాంతాల్లో మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నామని వారు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పక్కవారికే పలకరింపు..

వరద ముంపునకు గురైన కాలనీల్లో పాలకులు, సీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు రోడ్డు పక్కగా వరద లేని ప్రాంతాల వరకే వచ్చి ఆహార పాకెట్లు విసిరేసినట్టుగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వరదలోని ఇండ్ల వరకు రావడం లేదు. ఆహార పదార్థాలు కూడా తినేలా కనిపించడంలేదని, అవి తీసుకుంటే ఏ ఫుడ్ పాయిజన్ అవుతుందోనని స్థానికులు జంకుతున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో బ్లీచింగ్, మలేరియా ఆయిల్, పారిశుధ్య పనులు చేపట్టక పోవడంపై షిరిడీనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎక్కడ నిలదీస్తారోనని కాలనీ వీధుల్లోకి రాకుండా ప్రధాన రోడ్లకే పరిమితమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

భయాందోళనలోనే..

ఇండ్ల గోడలు నానుతున్నాయి. ప్రహారీలు కూలుతున్నాయి. నీటి ప్రవాహం ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగితే ఇండ్లు సురక్షితమేనా..? అనే ఆందోళన షిరిడీగనర్ వాసుల్లో నెలకొంది. ఐదు రోజులుగా ఈ కాలనీల్లో వరదనీరు ఇండ్లనుంచి ప్రవహిస్తోంది. గత శనివారం రెండిండ్ల ప్రహారీలు కూలాయి. ఎన్ఎండీసీ కాలనీ స్ట్రీట్ నెం. 2 లో కనీసంగా నడుములోతుగా నీరు చేరడంతో ఆ ఇండ్లలోని సరుకులు, పరికరాలు, వస్త్రాలు నష్టపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో నని ఆ కాలనీల వాసులు భయాందోళనలో ఉన్నారు.

ఎందుకు ముంపు..

వరద నీరుతో బండ చెరువు నిండితే అలుగు వెళ్లే నాలా ద్వారా వెళ్లాలి. కానీ, ఆ నాలా పూర్తిగా సన్నగా చేశారు. బండ చెరువు నిండగానే ముంపునకు గురయ్యే కాలనీల వారు గండి వేస్తుంటారు. ఫలితంగా నీరు పెద్ద ఎత్తున అలుగు వెళ్లే నాలా ద్వారా రావడం, ఆ వరదకు సరిపడా వెడల్పు లేకపోవడంతో వరద నీరంతా ఎన్ఎండీసీ, షిరిడీనగర్, రాజానగర్, దుర్గానగర్ లను ముంచెత్తుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

తడితే బాధలే : విమల, ఎన్ఎండీసీ కాలనీ
రాత్రికి రాత్రే వరద నీరు నడుము లోతుగా చేరితే తాము ఎటువెళ్ల లేక భయంతో బెడ్డు మీదనే ఉండి తెల్లవార్లూ జాగారం చేశాం. నిద్రాహారాలు మాని ఎప్పుడు నీరు తగ్గుతుందా అని ఎదురు చూశాం. కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టమైంది. రెండు రోజులు నరకం చూశాం.

కారం భోజనం ఇచ్చారు : మౌనిక, ఎన్ఎండీసీ కాలనీ
నాలుగు రోజులకు ఒకతను వచ్చి సిల్వర్ కవర్‌తో ఉన్న ఆహారపు పొట్లాలు నాల్గు అందించి వెళ్లిపోయాడు. హమ్మయ్యా అంటూ అవి తెరిచి చూస్తే కారం భోజనం ఉంది. అసలే వర్షాలు.. కారం భోజనం తీసుకుంటే విరేచనాలు అవుతాయని పక్కనే పెట్టాం. ఇప్పటికీ భయంభయంగానే గడుపుతున్నాం..

తినడానికి తిండి కూడా లేదు : మహేష్, షిరిడీనగర్
నాలుగు రోజులు గడిచే సరికి ఇంట్లో ఉన్న బియ్యం అన్నీ తడిచిపోయాయి.. ఇంకా వరదలోనే ఉన్నాం. తినడానికి ఇప్పుడు మాకు తిండికూడా లేదు.. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఎవరెవరో వచ్చి చూసిపోతున్నరు గాని ఎవ్వరూ ఆదుకోవడం లేదు.. మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.

Advertisement

Next Story