పీపుల్స్ వాయిస్.. నో వైరస్.. నో టీకా

by Aamani |
పీపుల్స్ వాయిస్.. నో వైరస్.. నో టీకా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా కేసులు తగ్గాయనే భావన.. అసలు వైరసే లేనప్పుడు టీకా ఎందుకనే యోచన.. టీకాపై అనవసర ప్రచారాలు, భయాలు, అపోహల కారణంగా రెండో విడత వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీస్, రెవెన్యూ సిబ్బంది టీకాలు వేసుకోగా, తాజాగా వైద్యారోగ్య శాఖ సిబ్బందికి రెండో విడత వ్యాక్సినేషన్​కూడా పూర్తయింది. తొలి కంటే రెండో విడతలో తక్కువ మంది టీకాలు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలతో పాటు సోషల్ మీడియాలో అనవసర ప్రచారంతో వ్యాక్సిన్​వేసుకునేందుకు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.

కారణాలనేకం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా టీకా ఇస్తుండగా.. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ శాఖ సిబ్బందికి తొలి విడతలో టీకా ఇచ్చారు. తాజాగా వైద్యారోగ్యశాఖ సిబ్బందికి రెండో విడత టీకా కూడా ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో తొలి విడతలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది 2,559 మందికి టీకా ఇవ్వగా.. రెండో విడతలో 2,328 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. మరో 231 మంది మొదటి విడత కంటే రెండో విడతలో తక్కువగా టీకా తీసుకున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు మారడంతో జలుబు, జ్వరం, దగ్గు వంటివిరాగా.. మరికొందరు బయటకు వెళ్లిన కారణంగా తీసుకోలేదనే కారణాలు చెబుతున్నారు. కొందరు పనులు ఉండడం వల్ల ఇండ్లలో ఉన్నారు. ఇందులో సగం నిజమైన కారణాలున్నాయి. కొందరు మాత్రం టీకాపై అవగాహన లేక.. అనవసర భయం, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.

వైరస్​ లేదనే భ్రమలోనే..

గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు కావడంలేదని, అసలు వైరస్ లేదనే భ్రమలో చాలా మంది ఉన్నారు. పెద్ద ఎత్తున కేసులు, తీవ్రత తగ్గడంతో.. అసలు జబ్బు లేనప్పుడు టీకా ఎందుకనే భావనతో ఉన్నారు. వాస్తవానికి వైద్యారోగ్య శాఖ సిబ్బంది చాలా మంది టీకా వేసుకున్నారు. సుమారు 90 శాతానికిపైగా టీకాలు వేసుకోగా.. ప్రైవేటు వైద్య సిబ్బంది 80 శాతం, పోలీసు శాఖ సిబ్బంది 70 శాతానికిపైగా వేసుకున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది మాత్రం 43 శాతమే వేసుకున్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి టీకాలపై అవగాహన ఉండడంతో పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. టీకా ఆవశ్యకత గురించి వైద్యారోగ్య శాఖ సిబ్బందికి తెలిసినంతగా ఇతర శాఖల వారికి తెలియకపోవడం వల్లే తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల పాటు టీకాలు ఇస్తున్నందున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో మొదటి దశలో వైద్యారోగ్య శాఖ, పోలీస్ సిబ్బంది 50 శాతం మంది మాత్రమే తీసుకున్నారు. బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జనవరి 16న 33 మంది తీసుకోగా.. ఫిబ్రవరి 13న రెండో విడతలో అంతే మంది తీసుకున్నారు. జనవరి 18న తీసుకున్న 30 మందిలో.. రెండో దఫా తీసుకునేందుకు వెనకడుగు వేశారు. తమ ఆరోగ్య పరిస్థితి బాగోలేనందునే తీసుకోలేదని.. బాగు పడిన తర్వాత తీసుకుంటామని చెబుతున్నారు. కొందరు అవసర భయాలు పెట్టుకుంటున్నారని.. సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం కారణంగా కొందరు టీకా వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు నిర్మల్ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్​ధనుంజయ ‘దిశ ప్రతినిధి’తో పేర్కొన్నారు. తీసుకోని వారికి నేడు టీకాలు ఇస్తామని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో తొలి దశలో తీసుకున్న వారిలో 75శాతం మందికి ఇచ్చామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్​నీరజ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed