విద్యుత్ బిల్లులపై ప్రజలకు ఊరట..!

by Shyam |   ( Updated:2020-03-28 06:16:47.0  )
విద్యుత్ బిల్లులపై ప్రజలకు ఊరట..!
X

-డిస్కంలకు మారటోరియంపై
సీఈఆర్సీకి కేంద్రం మార్గదర్శకాలు

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో వివిధ రకాల మినహాయింపులు పొందుతున్న ప్రజలకు తాజాగా విద్యుత్ బిల్లుల చెల్లింపు వాయిదా రూపంలో మరో ఊరట లభించనుందా అంటే అవుననే తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఆర్సీ)కి ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి చూస్తే తెలంగాణలో ఉన్న రెండు డిస్కంలు సైతం మార్చి నెల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రజల నుంచి ఎప్పటిలాగా వసూలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే నగదు కొరత లేని, బిల్లులు చెల్లించగలిగే వాళ్లు డ్యూ డేట్ లోపు చెల్లించుకోవచ్చని డిస్కంలు ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల ప్రజల్లో చాలా మంది కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో లేరని దీంతో డిస్కంలకు నిధుల సమస్య ఏర్పడవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అభిప్రాయ పడింది. ఇది చివరకు డిస్కంలు పవర్ ప్లాంట్లకు, ట్రాన్స్‌మిషన్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. దీంతో 3 నెలల పాటు డిస్కంలు చేయాల్సిన పేమెంట్లపై మారటోరియం విధింపు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ సీఈఆర్‌సీని కోరింది. ఇదే రకమైన మార్గదర్శకాలను రాష్ట్రాల విద్యత్ రెగ్యులేటరీ కమిషన్‌(ఎస్‌ఈఆర్సీ)లకు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. ఈ మారటోరియం రిలీఫ్ తెలంగాణ డిస్కంలకు కూడా లభించనుండడంతో అవి రాష్ట్రంలో ప్రజలు రాబోయే మార్చి నెల విద్యుత్ బిల్లులు చెల్లించకపోయినప్పటికీ జరిమానాలు విధించడం, కనెక్షన్లు తొలగించడం లాంటివి చేయబోవని తెలుస్తోంది.

Tags : corona, lock down, electricity bills, power ministry, cerc, discoms, telangana

Advertisement

Next Story

Most Viewed