వారి కోసం ‘క్యాష్ ఎట్ హోమ్’

by vinod kumar |
వారి కోసం ‘క్యాష్ ఎట్ హోమ్’
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా ముందు వరకు ఒక లెక్క. కరోనా తర్వాత మరో లెక్క అన్నట్లు మారాయి పరిస్థితులు. లాక్డౌన్ ఎత్తేసినా.. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. గతంలోలాగా సమూహాల్లో తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కారణంగా చాలా మంది డిజిటిల్ పేమెంట్స్, ఆన్ లైన్ ఆర్డర్స్ వైపు అడుగులు వేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా కంపెనీలు కూడా ఆ దిశగానే ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్ బ్యాంక్.. కరోనా సయమంలో.. కాలు గడపదాటకుండా ‘క్యాష్ ఎట్ హోమ్’ సర్వీస్ ను ప్రారంభించింది.

కరోనా వల్ల అందరూ ‘హోమ్ డెలివరీ’ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ‘క్యాష్ ఎట్ హోమ్’ సేవలు ప్రారంభించింది. ఏటీఎంకు వెళ్లకుండానే డబ్బులు మన ఇంటి ముందుకు వచ్చేస్తాయి. పేటీఎం పేమెంట్ బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్నోళ్లు తమ మొబైల్ లో తమ అకౌంట్ నుంచి మనీ కావాలని రిక్వెస్ట్ పెడితే చాలు.. పేటీఎం ఉద్యోగి ఇంటి వద్దకే వచ్చి క్యాష్ అందిస్తారు. రూ. 1000 నుంచి 5 వేల వరకు తీసుకునే అవకాశం ఉంది. రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతం ఢిల్లీతో పాటు దేశ రాజధాని ప్రాంతంలోని వృద్ధులకు, వికలాంగులకు ‘క్యాష్ ఎట్ హోమ్’ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దీని సేవలు కొనసాగిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ‘వయస్సు, అనారోగ్యం, ఇతర సమస్యల వల్ల ఏటీఎం, బ్యాంకులకు వెళ్లలేని వారికి ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని’ పేటీఎం అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం క్యాష్ ను ఇంటి వద్దే అందివ్వడానికి హర్యానా ప్రభుత్వం ఇటీవలే కొత్త పోర్టల్ ను ప్రారంభించింది. కేరళలో కూడా ఈ తరహా సేవలు ఉన్నాయి.

Advertisement

Next Story