పవన్ టార్గెట్: నాలుగేళ్లు.. రూ. 500 కోట్లు!

by Shyam |
పవన్ టార్గెట్: నాలుగేళ్లు.. రూ. 500 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోగా కోట్లాదిమంది అభిమానాన్ని పొంది పవనిజాన్ని స్ప్రెడ్ చేసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా ప్రజల దగ్గరికి వెళ్లాడు. వారి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నంగా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఎన్నికల్లో ఫలితాలు నిరాశపరిచాయి. కానీ, వెనక్కి తగ్గలేదు. అడుగు ముందుకు వేస్తూనే ఉన్నాడు. రెండో ప్రయత్నంలో ఫలితం తప్పక తన వైపే ఉంటుందనే ధీమాతో పయనిస్తున్నాడు. కానీ, జనసేన పెద్ద పార్టీ ఏం కాదు? పార్టీని నడిపించేందుకు ఫండ్స్ లేవు? అవి తీసుకొచ్చేందుకు నీచ రాజకీయాలు చేసే వైఖరి పవన్‌కు లేదు. అందుకే తనకు పెద్దపీట వేసి ఆదరించిన సినిమాలనే నమ్ముకున్నాడు. సినిమాలు చేసి సంపాదించిన డబ్బులను పార్టీ ఖర్చుల కోసం వాడాలని నిశ్చయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా సినిమా కథలు విన్న పవన్ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకోవాలని నిశ్చయించుకుని.. తద్వారా పార్టీ కార్యకలాపాలు సాగించేందుకు నిర్ణయించాడు. అందుకోసం పవన్‌కు రూ.500 కోట్లు కావాలట. నాలుగేళ్లలో మళ్లీ వచ్చే ఎన్నికల లోపు ఇంత డబ్బును సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నాడట. అందుకే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూనే జనసేనానిగా జనాల మధ్యలో ఉండాలని డిసైడ్ అయ్యాడట. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ప్రయత్నంలో ఉన్న పవన్… దీనికి డబ్బులు అడ్డుకాకూడదనే సినిమాలు మళ్లీ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

పవన్ కూడా ఇదే చెప్పాడు. సినిమాలు చేయను ప్రజా సేవలోనే నిమగ్నమై ఉంటానని హామీ ఇచ్చిన పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్తున్నాడనే కారణంతోనే మాజీ జేడీ లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశాడు. ఆ సమయంలోనే పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చి విమర్శకుల నోరు మూయించాడు. తాను సినిమాల్లోకి వస్తుంది ఆ డబ్బుతో నా పార్టీని నడిపించుకునేందుకు, నా కుటుంబాన్ని పోషించుకునేందుకు అని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed