కాటన్ అపర భగీరథుడు: పవన్ కల్యాణ్

by srinivas |
కాటన్ అపర భగీరథుడు: పవన్ కల్యాణ్
X

దిశ ఏపీ బ్యూరో: సర్ ఆర్థర్ కాటన్ అపర భగీరథుడు అని జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కొనియాడారు. గోదావరి నదిపై 160 ఏళ్ల కిందట ఆయన నిర్మించిన ఆనకట్ట వల్లే ఆ డెల్టా నేటికీ పచ్చగా కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. కాటన్ జయంతి సందర్భంగా జనసేన తరపున మనఃపూర్వక అంజలి ఘటిస్తున్నానని అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతోపాటు తాగు నీటిని అందించాలంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అని, కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందని అన్నారు. గోదావరిలో పుణ్య స్నానం ఆచరించేటప్పుడు కాటన్‌ను స్మరిస్తూ నేటికీ అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అని కొనియాడారు. కేవలం, గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధానాలుగా భావించే నేటి తరం పాలకులు, కాటన్ తాను చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పడ్డ తపన గురించి తెలుసుకోవాలని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తేనే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా, కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed