వాటితో జనసైనికులను అడ్డుకోలేరు- పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2021-07-20 08:10:15.0  )
pawan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: అర్థరాత్రి అరెస్టులు, నిర్బంధాలతో జనసైనికులను అడ్డుకోలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా ఏపీలో అన్ని జిల్లాల్లో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలలో జనసేన వినతిపత్రాలు ఇచ్చే కార్యాచరణను పోలీసులు అడ్డుకోవడంపై పవన్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేయడంపై ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక 10 వేల ఉద్యోగాలతో జాబ్‌క్యాలెండర్ విడుదల చేయడంపై మండిపడ్డారు. నిరుద్యోగులకు సంఘీభావంగా జనసేన నేతలు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలలో వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. సోమవారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ భారీ జనంతో నిర్వహించే కార్యక్రమాలకు, ఊరేగింపులు, సన్మానాలు నిర్వహిస్తే వర్తించని నిబంధనలు వినతిపత్రాలు ఇచ్చేందుకు మాత్రం వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ధర్మం, న్యాయం పక్షాన మాట్లాడడం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లడం జనసేన నైజం అని ప్రకటనలో తెలిపారు. నిర్భంధాలు, అరెస్టులతో తమ గొంతు నొక్కాలనుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఎంత కట్టడి చేయాలని చూసినా జనసైనికులు నిరుద్యోగుల తరఫున జిల్లాల ఉపాధి అధికారులకు వినతి పత్రాలు అందించడంలో విజయవంతం అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసైనికుడికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed