వైఎస్సార్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

by srinivas |
Pawan
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృభిస్తున్న తరుణంలో ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, అత్యవసర వైద్య సేవలను అందించాల్సిన తరుణంలో… తప్పులను వేలెత్తి చూపుతున్న వారిపై వైఎస్సార్సీపీ నేతలు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని ఇది మంచిపద్దతి కాదని హితవు పలికారు. అందులో భాగంగానే కన్నాపై వ్యక్తిగత విమర్శలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండిచాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీలో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని జనసేనాని ఆరోపించారు. రెండు, మూడు రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాంటి భావననే కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. కరోనా రక్కసికి అగ్ర రాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి తరుణంలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని ప్రశ్నించారు.

దేశంలో లక్షలాది మంది కార్మికులు, ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊర్లో ఉంటూ, అర్ధాకలితో అలమటిస్తున్న సమయంలో వారికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. రైతులు పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారని అన్నారు. ఏపీపై కూడా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని ఆయన గుర్తు చేశారు. గత వారం రోజులుగా ఏపీలో పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి భీతావహంగా ఉందని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపే వారిపై వైఎస్సార్సీపీ నేతలు బురద చల్లే కార్యక్రం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రక్కసి వదిలిపెట్టి పోయేంత వరకు చిల్లర రాజకీయాలను దూరంగా పెడదామని జనసేన పిలుపునిస్తోందని ఆయన చెప్పారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరిద్దామని చెప్పారు. ఈ సమయంలో కూడా రాజకీయాలను ఆపకపతే ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయని ఆయన సూచించారు.

tags:ysrcp, janasena, vijayasai reddy, kanna laxminarayana, bjp, pawan kalyan

Advertisement

Next Story

Most Viewed