మల్లయోధులను సన్మానించిన పవర్‌ స్టార్

by Jakkula Samataha |
మల్లయోధులను సన్మానించిన పవర్‌ స్టార్
X

దిశ, సినిమా : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు స్వతహాగా ‘మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ, కరాటే, కర్రసాము’ వంటి సెల్ఫ్ డిఫెన్స్ విద్యలపై మక్కువ ఎక్కువ. వాటికి ప్రాచుర్యం కల్పించాలనే తపనతో తన చిత్రాల్లో ఏదో ఓ సందర్భంలో ఆయా సెల్ఫ్ డిఫెన్స్ విద్యలను చూపిస్తుంటాడు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న క్రిష్-పవన్ మూవీలో మల్లయోధులతో పవన్‌కు పోరాట సన్నివేశాలు ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చి, పీఎస్‌పీకే27లో పాల్గొన్న 16 మంది మల్లయోధులను పవన్ సన్మానించడం విశేషం.

‘మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యాలేలుతారు. నా చిత్రంలో పాల్గొన్న మల్లయోధులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు అందించిన స్ఫూర్తితో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారత్‌లో బలమైన సమాజ పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా’ అని పవన్ అన్నారు. ఇక 16 మంది మల్లయోధులను శాలువాలతో సన్మానించి, వెండి హనుమంతుడి విగ్రహాలతో పాటు గదను బహూకరించారు. చిన్నప్పుడు తాను చీరాలలో ఉన్నప్పుడు తండ్రితో కలిసి కుస్తీ పోటీలు చూడ్డానికి వెళ్లేవాణ్ణని, నేర్చుకోవాలన్న తపన ఉన్నా శారీరక దారుఢ్యం తక్కువ కావడంతో నేర్చుకోలేకపోయానని వెల్లడించారు. ప్రముఖ తెలుగు మల్లయోధుడు కోడి రామ్మూర్తి గొప్పదనంతో పాటు ఆయన సాధించిన విజయాలు, ఎదిగిన వైనాన్ని ఈ సందర్భంగా మల్లయోధులకు తెలిపాడు. తర్వాతి కాలంలో తాను కరాటే, వూషూ వంటి పోరాట విద్యలను నేర్చుకున్నానని, అయితే భారత ప్రాచీన యుద్ధ విద్యలంటే తనకు ఎంతో అభిమానమని, వాటిని భావితరాలకు అందించాలని అన్నారు. బలమైన మెదడుతో పాటు బలమైన శరీరం కూడా అవసరమేనని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed