మంత్రి జగదీష్ రెడ్డి నాలుక కోస్తాం: పటేల్ రమేష్ రెడ్డి

by Anukaran |   ( Updated:2021-07-29 05:57:58.0  )
మంత్రి జగదీష్ రెడ్డి నాలుక కోస్తాం: పటేల్ రమేష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట: హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తాను ఎక్కడ సమావేశాలు నిర్వహించినా.. స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా కేవలం ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకులను పిలుచుకొని కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి ఏవిధంగా గెలిచారో.. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతకు ఎక్కువ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ వెంకటరెడ్డిలను పిలవకపోవడం దుర్మార్గమైన చర్య అని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. పోలీసులతో రాజగోపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు . ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవలేదని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డిపై మంత్రి స్థాయిలో ఉన్న జగదీష్ రెడ్డి బట్టలూడదీస్తానని మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు .

ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రికి లేదని హెచ్చరించారు. అవాకులు చెవాకులు చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే.. కాంగ్రెస్ కార్యకర్తలు నాలుక కోస్తారని హెచ్చరించారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి రెండుసార్లు గెలిచినప్పటికీ.. ప్రజాబలంతో గెలవలేదని కేవలం అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో గెలిచాడన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మంత్రి జగదీష్ రెడ్డి విమర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పటేల్ రమేశ్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed