డీలాపడిన ప్యాసింజర్ వాహన విక్రయాలు 

by Harish |   ( Updated:2020-09-09 04:12:54.0  )
డీలాపడిన ప్యాసింజర్ వాహన విక్రయాలు 
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ఆగష్టుతో పోలిస్తే ప్యాసింజర్ వాహానాల రిటైల్ అమ్మకాలు 7.12 శాతం తగ్గి 1,78,513 యూనిట్లకు చేరుకున్నాయని ఆటోమొబైల్ డీలర్స్ బాడీ, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) బుధవారం తెలిపింది. 2019, ఆగష్టులో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 1,92,189 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత నెలలో 27.71 శాతం క్షీణించి 8,98,775 యూనిట్లకు చేరుకోగా, 2019 ఆగష్టులో 12,60,722 యూనిట్లుగా నమోదయ్యాయి.

వాణిజ్య వాహన అమ్మకాలు 2019, ఆగష్టులో నమోదైన 62,270 యూనిట్లతో పోలిస్తే 57.39 శాతం క్షీణించి 26,536 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక త్రీ-వీలర్ అమ్మకాలు 2019, ఆగష్టులో 55,293 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగా, గత నెలలో 69.51 శాతం క్షీణించి 16,857 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని కేటగిరీలలో మొత్తం అమ్మకాలు ఆగష్టులో 26.81 శాతం క్షీణించి 11,88,087 యూనిట్లకు చేరుకోగా, అంతకుముందు ఏడాది ఆగష్టులో మొత్తం అమ్మకాలు 16,23,218 యూనిట్లుగా నమోదయ్యాయి.

పండుగ సీజన్ ప్రారంభం కావడంతో పాటు ప్రభుత్వం పరిశ్రమల పునరుజ్జీవనానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా మునుపటి నెలలతో పోలిస్తే ఆగష్టులో మెరుగైన అమ్మకాలు కనిపిస్తున్నాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటి తెలిపారు. రికవరీ సానుకూలంగా ఉంది. ఏడాది ప్రాతిపదికన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనట్టు వింకేశ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ మందగించే సంకేతాల నేపథ్యంలో ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు అధికంగా డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ప్రకటనతో పాటు స్క్రాపేజ్ పాలసీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని వింకేశ్ గులాటి వెల్లడించారు.

Advertisement

Next Story