‘మహా’లో మంటపెట్టిన ఇంధనం..

by Shamantha N |   ( Updated:2021-02-22 08:31:15.0  )
‘మహా’లో మంటపెట్టిన ఇంధనం..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర ప్రజలకు నాన్‌స్టాప్ షాక్స్ తగులుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న వేళ మరోసారి ఆ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే అక్కడ 4వేల కొవిడ్ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. కాగా, కరోనా కేసులతో పాటు వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంపై మహారాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

లాక్‌డౌన్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై కేంద్రం పన్నుల రూపంలో భారం వేస్తోందని మండిపడుతున్నారు. ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో నిత్యవసరాల ధరలు కూడా పెరిగాయని వాపోయారు. మార్కెట్లో ధరల పెరుగుదల వలన తలలు పట్టుకుంటున్న మధ్య తరగతి ప్రజలకు సోమవారం మరోషాక్ తగిలింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్రలో సామాన్యులు ఎక్కువ మంది లోకల్ ట్రైన్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఆటోరిక్షాలు, టాక్సీలపై ఆధారపడుతుంటారు. కరోనా నేపథ్యంలో లోకల్ ట్రైన్స్ పట్టాలెక్కడం లేదు.దీనికి తోడు కేంద్రం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. ఇంధన చార్జీలు పెరుగుతుండటంతో ప్యాసింజర్ చార్జీలు పెంచేందుకు టాక్సీ, ఆటోరిక్షా యూనియన్ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు దాదాపు రూ.3 చార్జీల పెంపు ఉంటుందన్నారు.

కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయి, పని లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే.. కేంద్రం చర్యలతో ప్యాసింజర్ వెహికిల్స్ చార్జీలు పెంచడంపై ‘మహా’వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. . పెట్రోల్, డీజిల్ చార్జీల పెంపుతో తాము రెవెన్యూ కోల్పోతున్నామని, లాభం కాదు కదా.. ఇంధనానికి ఖర్చు పెట్టే డబ్బులు కూడా రావడం లేదని డ్రైవర్స్ ఆవేదన చెందుతున్నారు. ఇలాగైతే తమ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అందువల్లే చార్జీల పెంపు అనివార్యమైందని ప్యాసింజర్ వెహికిల్స్ యూనియన్ సంఘాల నాయకులు స్పష్టంచేశారు.ముంబై మెట్రోపాలిటిన్ సిటీలో పెరిగిన చార్జీలు ప్రకారం ఆటోరిక్షా మినిమమ్ చార్జీ రూ.18 నుంచి 21చేరగా.. బ్లాక్ అండ్ యెల్లో టాక్సీ ధర రూ.22 నుంచి 25కు చేరింది. ఇదిలాఉండగా, దేశంలో వరుసగా 12వ రోజు కూడా ఇంధన చార్జీలు పెరగడంతో ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97 ఉండగా.. డీజిల్ రూ.88.06గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed