పారిశ్రామిక రంగానికి 'పాక్షిక' కష్టాలు!

by Shyam |
పారిశ్రామిక రంగానికి పాక్షిక కష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ను ఇంకో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ పొడిగించిన కారణంగా కొంతవరకూ సడలింపులను ఇచ్చింది. అయితే, ఈ సడలింపులు ఏ మాత్రం సరఫరా సమస్యలను తొలగించవని, సరఫరా చైన్‌ను సరిచేయడం అంత సులభం కాదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. మే 17 వరకూ లాక్‌డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో వ్యవసాయం, కొన్ని రకాల పరిశ్రమలు, నిర్మాణ రంగం వంటి వాటిలో నిబంధనలతో కూడిన సడలింపులను కేంద్రం అమలు చేయాలని స్పష్టం చేసింది. పాక్షిక సడలింపుతో.. కుదేలైన, గందరగోళంలో ఉన్న సరఫరా చైన్‌ను మునుపటి స్థితిలోకి తీసుకురావడం కష్టమని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

సరఫరా చైన్ బలపడ్డానికి..

ఇప్పుడున్న పరిస్థితుల్లో..గణాంకాల ప్రకారం, 49 రోజుల లాక్‌డౌన్‌ను సమర్థించవచ్చు. దీనికి కీలక అంశాలు మదింపు చేయాల్సి ఉందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థకు సంపూర్ణ స్వేచ్ఛ కోసం.. అనుసరించే పాక్షిక సడలింపు వ్యూహానికి సంబంధించి అంచనాలను మించిన ప్రక్రియ మొదలుపెట్టాలి. మే 4 నుంచి కేంద్రం ఇచ్చే పాక్షిక సడలింపు వల్ల ప్రయోజనాలు తక్కువగానే ఉంటాయి. సరఫరా చైన్‌లో సమతుల్యత సాధించడం ఈ పరిస్థితుల్లో క్లిష్టమైన అంశం. మే 17 తర్వాతైనా పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎత్తివేస్తారని భావిస్తున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ప్రజలు, కార్మికులు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తే తిరిగి సరఫరా చైన్ బలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ ఎత్తివేస్తే పారిశ్రామిక రంగం నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. ప్రధాన ఉత్పత్తి తగ్గిపోతే ప్రొడక్ట్ అసెంబ్లింగ్‌కి ఆటంకం తప్పదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.

సమాయత్తం అవ్వాలి..

ప్రభుత్వానికి ఇది కొత్త సవాలు. కరోనాను ఎదుర్కోవడానికి, దానివల్ల విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్‌ను పొడిగించకపోతే ప్రస్తుతం కేంద్రం గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్‌లుగా విధించిన ప్రాంతాలు సైతం రెడ్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదముంది. దీన్ని ఎవరూ తట్టుకోలేరు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం పలు కీలక మార్గదర్శకాలను జారీ చేస్తోంది. దీనికి పారిశ్రామిక రంగం సమాయత్తం అవ్వాల్సి ఉందని మారుతీ సుజుకీ ఛైర్మన్ భార్గవ వివరించారు.

జీడీపీలో 3 శాతం కావాలి…

దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రం లాక్‌డౌన్ సడలింపు వల్ల పారిశ్రామిక రంగానికి ఊరట లభిస్తుంది. అయితే, వాటివల్ల అనుకున్న ఫలితాలు అందుకోవడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి. నిబంధనలను అమలు చేస్తూ నియంత్రణల వల్ల ఇప్పటికే పారిశ్రామిక వర్గం నీరసించింది. కాబట్టి కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడానికి బలమైన ఆర్థిక మద్దతు ఆశిస్తున్నట్టు పరిశ్రమలు భావిస్తున్నాయి. ఇప్పటికే నష్టపోయిన, భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను దృష్టిలో ఉంచుకుని దేశ జీడీపీలో 3 శాతానికి సమానమైన అంటే సుమారు రూ. 6 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అంచనా వేస్తున్నామని భారతీయ పరిశ్రమల సమాఖ్య వెల్లడించింది. రుణభారం తక్కువగానే ఉన్నందున ప్రభుత్వం ఈ స్థాయి ప్యాకేజీని ఇస్తుందనే అభిప్రాయం కూడా ఉన్నట్టు పరిశ్రమల సమాఖ్య డీజీ చంద్రజిత్ అభిప్రాయపడ్డారు.

Tags: RC Bhargava, Mahindra Group, lockdown, coronavirus, cii, Chandrajit Banerjee, Anand Mahindra

Advertisement

Next Story