ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. మా పిల్లలను చూపించాలని రోడ్డెక్కిన పేరెంట్స్

by Sridhar Babu |
ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. మా పిల్లలను చూపించాలని రోడ్డెక్కిన పేరెంట్స్
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రిన్సిపల్ నిర్లక్ష్యపూరితమైన వ్యవహార శైలి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు కారణమైంది. తమ పిల్లలను చూసుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాఠశాల ఆవరణలో ఎదురుచూసినా కనీసం పట్టింపు లేకుండా వ్యవహారించటంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చారు. ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ కరీంనగర్-పెద్దపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. గంటకు పైగా రాకపోకలు స్తంభింపజేయటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఆందోళనకారుల వద్దకు వచ్చి నచ్చజెప్పి ప్రిన్సిపల్‌తో మాట్లాడి పిల్లలను చూసేందుకు అనుమతి ఇప్పించారు. దీంతో ఆందోళన విరమించి పాఠశాల ఆవరణలోకి వెళ్లటంతో సమస్య సద్దుమణిగింది.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా.. కరోనా నేపథ్యంలో విద్యార్థుల వద్దకు ఎవరిని కూడా అనుమతించటం లేదని తెలిపారు. అయితే, ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ 15 రోజులకు ఒకసారి పేరెంట్స్‌కు అనుమతి ఉన్నా, నిబంధనలు విస్మరించటంపై మండిపడుతున్నారు.

ఒకవేళ పిల్లల పట్ల అంతా జాగ్రత్తలు పాటిస్తే ముందుగానే సమాచారమివ్వాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించాల్సి ఉన్నా అవేమి పట్టించుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు బయట నిరీక్షింపజేయటం సమంజసం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని, పేరెంట్స్‌ను అనుమతిస్తే సమస్యలు చెప్పుకుంటే బయటకు పొక్కుతాయనే అనుమతించలేదని ఆరోపిస్తున్నారు.ప్రిన్సిపల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు స్ఫష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed