మండపంలో పెళ్లికూతురు.. పోలీసుబండిలో తల్లిదండ్రులు

by Shyam |   ( Updated:2021-05-23 03:20:48.0  )
మండపంలో పెళ్లికూతురు.. పోలీసుబండిలో తల్లిదండ్రులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఎక్కడైనా పెళ్లి బృదం డీసీఎం వ్యాన్ లేదా బస్సులో పెళ్లిమండపానికి వెళ్తారు. కానీ వనపర్తి జిల్లాకు చెందిన పెళ్లివారు విచిత్రంగా పోలీసు వాహనంలో వివాహం జరిగే గ్రామానికి చేరింది. మహబూబ్ నగర్ వన్ టౌన్ సిఐ రాజేశ్వర్ గౌడ్ స్వయంగా పెళ్లి బృందాన్ని పోలీసు వాహనంలో గమ్యస్థానానికి చేర్చి అందరి అభినందనలు అందుకుంటున్నారు.

వీటికి సంబంధించిన వివరాలు.. వనపర్తి జిల్లా కిలగణపురం మండలం అల్లా మాయపల్లికి చెందిన యువతికి మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న బోయపల్లి గ్రామానికి చెందిన యువకునితో ఆదివారం ఉదయం వివాహం జరగవలసి ఉంది. ఈ క్రమంలో పెళ్లికూతురు తరపు బంధువులు ఓ వాహనంలో పెళ్లికి బయల్దేరడానికి వెళ్లారు. మహబూబ్ నగర్ పట్టణంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆ వాహనంలో 30 మంది వరకు ఉండడంతో అందరినీ దించి వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా పెళ్ళి తంతులో ప్రధాన భూమికను పోషించే వలసిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇక్కడే ఉండడం, పెళ్ళికి అవసరమైన తాళిబొట్టు, తదితర సామాగ్రి సైతం వీరి దగ్గరే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఐ రాజేశ్వర్ గౌడ్ పెళ్లికి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు వాహనంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులను పంపారు. వివాహానికి ఆటంకాలు కలుగకుండా సహకరించిన సీఐకి అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story