కేసీఆర్ ధర్నాతోనే కేంద్రం దిగొచ్చింది.. అయినా ఉద్యమం ఆగదు

by Shyam |
Parakala MLA Challa Dharma Reddy
X

దిశ, పరకాల: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తోన్న రైతుల విజయానికి సూచిక అని పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా.. లెక్కచేయకుండా చివరివరకు పోరాడిన రైతులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రైతు బాగుపడితే దేశం బాగు పడుతుందనే నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. కేంద్రం వడ్లు కొనలేము అంటుంటే, గల్లీలో ఉండే బీజేపీ నేతలు మాత్రం వడ్లే వేయాలని రైతులకు చెప్పడం అమాయకత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

అందుకే రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టారని, కేసీఆర్ ధర్నాతోనే కేంద్రం దిగి వచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేవరకూ రైతుల పక్షాన చేసే ఉద్యమం ఆగదని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ రైతుల బాగుకోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed