పాండమిక్‌లో థాంక్స్‌ గివింగ్

by vinod kumar |
పాండమిక్‌లో థాంక్స్‌ గివింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికన్‌లు మనలాగ నెలకు రెండు పండుగలు జరుపుకోరు. ఉన్న రెండు పండుగలను రెండు నెలలపాటు జరుపుకుంటారు. దీన్నే వారు హాలీడే సీజన్ అని పిలుస్తారు. థాంక్స్‌గివింగ్‌తో మొదలై క్రిస్మస్, న్యూ ఇయర్‌తో వారి హాలీడే సీజన్ ముగుస్తుంది. ప్రతి ఏడాది ఇలా తమ కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్, డిసెంబర్ మాసాల్లో పండుగలు జరుపుకుని బాగా ఎంజాయ్ చేస్తారు. షాపింగ్‌ చేస్తారు. కొత్త కొత్త వంటకాలు చేస్తారు. ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సంవత్సరమంతా సంపాదించిన డబ్బును ఈ రెండు నెలలు ఖర్చుపెట్టి జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. అన్నింటి మీద ప్రభావం పడినట్లే అమెరికన్‌ల హాలీడే సీజన్ మీద కూడా కొవిడ్ దెబ్బ పడింది. బయట ఉన్న కుటుంబ సభ్యులను ఇళ్లకు ఆహ్వానించొద్దని, గుంపులు గుంపులుగా షాపింగ్‌ చేయొద్దని అమెరికాలోని చాలా రాష్ట్రాలు షరతులు విధిస్తూ ఆదేశాలు జారీచేశాయి. ఇలాంటి తరుణంలో మరి వాళ్లందరూ ఇవాళ థాంక్స్‌గివింగ్ ఎలా జరుపుకోబోతున్నారు?

థాంక్స్‌గివింగ్ అంటే మనకు అందిన దానికి ధన్యవాదాలు చెబుతూ జరుపుకునే పండుగ. అంటే పంట చేతికి వచ్చాక ఆ పంటను ఇచ్చినందుకు దేవునికి థాంక్స్ చెబుతూ ఆ పంటను దగ్గరి వాళ్లతో పంచుకుని, జీవితంలో భాగమైనందుకు వారికి కూడా థాంక్స్ చెబుతూ జరుపుకుంటారు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో నాలుగో గురువారం నాడు ఈ పండుగ జరుపుకుంటారు. 1941కి ముందు నవంబర్ నెలలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రోజున జరుపుకునేవారు. కానీ, అబ్రహం లింకన్ ఒక చట్టం తీసుకొచ్చి, నవంబర్ నెల నాలుగో గురువారం జరుపుకోవాలని నిర్ణయించారు. ఇక అప్పట్నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. థాంక్స్‌గివింగ్ కేవలం ఇంట్లోనే కాదు.. పరేడ్‌లు నిర్వహిస్తూ పబ్లిక్‌గా కూడా జరుపుకుంటారు. న్యూయార్క్ సిటీలో మేసీస్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్, ఫిలడెల్ఫియాలో ఏబీసీస్ డంకిన్ డోనట్స్ పరేడ్, చికాగోలో మెక్‌డొనాల్డ్స్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్‌లు చాలా పాపులర్. ఫ్లెక్సీలు పట్టుకుని డ్యాన్స్‌లు చేస్తూ రోడ్ల మీద థ్యాంక్స్‌గివింగ్ సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈసారి ఇవేవీ లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల రోజున నిర్వహించిన చిన్న చిన్న పరేడ్‌ల వల్లనే కరోనా కేసులు ఆ ఒక్కరోజునే లక్ష దాటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరేడ్‌లు అన్నింటినీ ఆయా రాష్ట్రాల సెనేట్‌లు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇక థాంక్స్‌గివింగ్ మరుసటి రోజు అంటే బ్లాక్‌ఫ్రైడే. ఇలా థాంక్స్‌గివింగ్ అయిపోగానే కుటుంబ సభ్యులతో కలిసి అమెరికన్‌లు షాపింగ్‌కు బయల్దేరతారు. అర్ధరాత్రి 12 గంటల నుంచే షాపుల బయట క్యూ కడతారు. బ్లాక్‌ఫ్రైడే సందర్భంగా తినుబండరాల నుంచి విలాస వస్తువుల వరకు అన్నింటి మీద భారీ తగ్గింపులు ఉండటమే ఇందుకు కారణం. బ్లాక్‌ఫ్రైడే రోజున సంవత్సరానికి సరిపడ వస్తువులు కొనడానికి అమెరికన్‌లు ఎగబడతారు. కానీ, ఈసారి క్యూలు కట్టే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులతో కలిసి తిరిగే లగ్జరీ లేదు. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్ అలవాటైంది కాబట్టి ఆన్‌లైన్‌లో బ్లాక్‌ఫ్రైడే ఆఫర్లను చూసి, ఒక్క క్లిక్ ద్వారా కొనేందుకు అమెరికన్‌లు రెడీ అవుతున్నారు. కానీ, ఫిజికల్‌గా షాపింగ్ చేసిన దానికి, ఆన్‌లైన్ షాపింగ్‌కు అనుభూతిలో చాలా తేడా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి దొరికే అవకాశాన్ని కూడా ఈ కరోనా వైరస్ కాలరాసిందని అమెరికన్‌లు బాధపడుతున్నారు.

అయినా సరే..పండుగ ఆనందం కోసం కొందరు అమెరికన్‌లు ముఖ్యంగా యువత ఈ పాండమిక్‌లో కూడా హాలీడే సీజన్‌ను నార్మల్‌గా గడపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొన్ని ఆన్‌లైన్ పరేడ్‌లను కూడా నిర్వహించడానికి వారు సిద్ధపడ్డట్లు సమాచారం. ఎప్పటిలాగే బ్లాక్‌ఫ్రైడే షాపింగ్ అనుభూతిని పొందడానికి కూడా కొందరు యువత రెడీ అయినట్లు రెడ్డిట్‌లో ఆన్‌లైన్ కమ్యూనిటీలు మాట్లాడుకుంటున్నాయి. మరి వీళ్లను నియంత్రించడానికి ప్రభుత్వ బలగాలు కూడా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందరినీ కట్టడి చేయలేకపోయినా వీలైనంత మేరకు కొవిడ్ వ్యాప్తిని తగ్గించగలిగితే చాలని ఆయా రాష్ట్రాల సెనేట్‌లు అనుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్ జరుపుకుంటామని కలలో కూడా అనుకోలేదని అక్కడి పోలీసు బృందాలు అంటున్నాయి. అమెరికన్‌లు ఇలా పాండమిక్‌లో థ్యాంక్స్‌గివింగ్ జరుపుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో 1918లో స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా పాండమిక్ థాంక్స్‌గివింగ్ సెలెబ్రేట్ చేసుకున్నారు.

1918 నవంబర్ నాటికి స్పానిష్ ఫ్లూ వైరస్ అమెరికాలో విజృభించి 3 లక్షల మంది అమెరికన్‌ల ప్రాణాలను బలిగొంది. కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యి సైనికులు ఇళ్లకు చేరుకున్నారు. యుద్ధం ముగియడం, థాంక్స్‌గివింగ్ ఈ రెండింటి కారణంగా జనాలు గుంపుగా చేరకుండా నియంత్రించడం ప్రభుత్వం వల్ల కాలేదని నాన్సీ టోమేజ్ అనే హిస్టరీ ప్రొఫెసర్ తన అధ్యయన కాపీలో రాసుకున్నారు. నిబంధనలు విధించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, దీంతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడంతో చర్చికి వెళ్లిరావడానికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు అమెరికన్‌లు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుని ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో గడిపి, థాంక్స్‌గివింగ్ జరుపుకున్నట్లు నాన్సీ ప్రస్తావించారు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకో రెండ్రోజులు వేచి చూడాలి!

Advertisement

Next Story

Most Viewed