ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామీణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ గ్రామీణ అభివృద్ధికి, సమస్యల పరిష్కరానికి ‘ప‌ల్లె ప్ర‌గ‌తి’ ప‌ట్టం క‌ట్టింద‌ని, అన్ని గ్రామాల స‌మ‌గ్ర ప్రగతికి ఈ ప‌థ‌కం దోహ‌దం చేస్తున్న‌ద‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి‌రెడ్డి, గాద‌రి కిషోర్‌కుమార్, మ‌హారెడ్డి భూపాల్‌రెడ్డిలు లేవనెత్తిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ద‌యాక‌ర్ రావు జవాబిచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ద్వారా గ్రామాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ తరపున చేపట్టిన ఎన్నో సంస్కరణలు, గ్రామాభివృద్ధిలో సత్పలితాలనిస్తున్నాయని వివరించారు. తెలంగాణలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతల విషయంలో ఈ చట్టం కొత్త నిర్వచనమిస్తుందని స్పష్టంచేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న 36వేల మంది సఫాయి కార్మికుల వేతనాలను రూ.8,500లకు పెంచినట్టు గుర్తుచేశారు. గ్రామాలభివృద్ధికి నిధులు కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి నెలా కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర వాటాను జమచేసి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. దీనికనుగుణంగా ప్రతినెలా రూ. 339 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. అలాగే పంచాయతీ నిధుల్లో కచ్చితంగా 10శాతం నిధులను పచ్చదనం కోసం ఖర్చు చేయాలని, కొత్త చట్టంలో నిబంధనను కూడా చేర్చినట్టు మంత్రి దయాకర్ రావు సభ్యులకు వివరణ ఇచ్చారు.

Tags: minister dayakar rao, assembly sessions, mlas queries, clarity

Advertisement

Next Story

Most Viewed